- ఐసీసీసీ నుంచి రేతిబౌలి వరకు నిర్మించేలా ప్లాన్!
- ట్రాఫిక్ తగ్గించేందుకు, ఎయిర్ పోర్టుకు షార్ట్‌కట్ కోసం డీపీఆర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ (ఐసీసీసీ) నుంచి రేతిబౌలి జంక్షన్ లోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే వరకు అనుసంధానంగా మరో ఫ్లై ఓవర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుంది. ఐసీసీసీ నుంచి ఫిల్మ్ నగర్, అపోలో ఆస్పత్రి, మల్కం చెరువు రోడ్డు వరకు( ఓల్డ్బాంబే రోడ్డు), అక్కడి నుంచి టోలిచౌకి, నానల్ నగర్ మీదుగా రేతిబౌలి జంక్షన్ వద్దనున్న పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేకి కొత్త ఫ్లైఓవర్‌ను లింక్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
నానల్ జంక్షన్ వరకు సింగిల్ ఫ్లైఓవర్‌గా, నానల్ నగర్ చేయ్యి గుర్తు సింబల్ నుంచి మెహిదీపట్నం వైపు ఒక ర్యాంప్ ను, అలాగే.. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేకు డైరక్ట్ గా మరో ర్యాంప్ ను నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎఫెక్ట్ అయ్యే ఆస్తులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు మీదుగా ప్రయాణించే వారు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా తక్కువ సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.
ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ రూ.1,090 కోట్ల వ్యయంతో 7 అండర్ పాస్ లు, 7 స్టీల్ ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి ఐసీసీసీ~రేతిబౌలి ఫ్లైఓవర్ కూడా తోడైతే హైదరాబాద్ వెస్ట్ జోన్ ట్రాఫిక్ స్వరూపమే మారిపోనుంది.త్వరలోనే ఇందుకు సంబంధించి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) ని జీహెచ్ఎంసీ రూపొందించనుంది.
