- మార్ఫింగ్ చేసి నెట్‌లో పెట్టాడా? బ్లాక్ మెయిల్ చేశాడా? అనే కోణంలో విచారణ
- ఆపరేటర్ మహేశ్ ‘మార్ఫింగ్’ కేసులో కొత్త విషయాలు
- డార్క్ వెబ్ లింక్‌లపై సైబర్ టీమ్ ఫోకస్
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ, మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసిన మహేశ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఐటీ టీమ్సాయంతో అతని ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో మహిళల ఫొటోలు, వీడియోలు గుర్తించగా.. తాజాగా డిలీట్ చేసిన ఫైళ్లను రికవరీ చేయగా మరింత డేటా బయటపడినట్లు తెలుస్తోంది.
ల్యాప్‌ట్యాప్‌లో సాధారణ ఫోల్డర్ల కంటే హిడెన్ ఫోల్డర్లే ఎక్కువగా ఉన్నాయని, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌తో ప్రత్యేకంగా సేవ్ చేసిన ఫైళ్లలో మహిళా ఉద్యోగుల ఫొటోలు, సోషల్ మీడియా నుంచి డౌన్‌లోడ్ చేసిన యువతుల చిత్రాలు, బాలికల ఫొటోలు సైతం ఉన్నట్లు సమాచారం. కొన్ని ఫొటోలను ఏఐ టూల్స్‌తో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వీడియోలుగా మార్చినట్లు తెలిసింది. మహిళల ఫొటోలతోపాటు
కొందరు పురుషుల ఫొటోలు కూడా ఉన్నట్లు సమాచారం.
విడాకుల తర్వాత సైకోగా ?
మహేశ్‌కు 2019లో పెండ్లి జరగగా.. వివిధ కారణాలతో 6 నెలలకే విడాకులయ్యాయి. అప్పటి నుంచి అతను ఒంటరిగా ఉంటున్నాడు. విడాకుల తర్వాత సైకోగా మారాడా? మహిళలపై కోపంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్ తరచూ విదేశీ వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింక్‌లు ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. మార్ఫింగ్ చేసిన ఫొటోలను డార్క్ వెబ్, పోర్న్‌సైట్లకు అమ్మేశాడా అనే కోణంలోనూ ఎంక్వైరీ జరుగుతోంది. ఫోన్, ల్యాప్‌టాప్ బ్రౌజింగ్ హిస్టరీ, క్లౌడ్ బ్యాకప్, ఈ–మెయిల్ అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహేశ్ వికృత చేష్టలు బయటపడడంతో విద్యుత్ శాఖ మహిళా ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యవహారాన్ని ఆఫీసర్లు గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంప్యూటర్ వినియోగంపై మానిటరింగ్, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు లేకపోవడమే ఇందుకు కారణమని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాగా, మహేశ్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మహేశ్‌పై ఐటీ యాక్ట్‌తో పాటు మహిళల గౌరవానికి భంగం కలిగించే సెక్షన్లు, పోక్సో కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిసింది.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
హుస్నాబాద్ విద్యుత్ శాఖకు సంబంధించిన కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాన్ని నిరూపిస్తాం. నిందితుడు మహేశ్ వల్ల ఇబ్బంది పడిన మహిళలు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.- హుస్నాబాద్ ఏసీపీ సదానందం
