చెన్నై: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్‌లో బోణీ చేసింది. ఛేజింగ్‌లో టిమ్ సిఫర్ట్ (65), గ్లెన్ ఫిలిప్స్ (42) చెలరేగడంతో ఆదివారం జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌కు చెక్ పెట్టింది. టాస్ నెగ్గిన అఫ్గాన్ 20 ఓవర్లలో 182/6 స్కోరు చేసింది. గుల్బాదిన్ నైబ్ (63) రాణించాడు. తర్వాత కివీస్ 17.5 ఓవర్లలో 183/5 స్కోరు చేసి నెగ్గింది. లక్ష్య ఛేదనలో సిఫర్ట్ దూకుడుగా ఆడినా.. రెండో ఓవర్‌లో ముజీబుర్ రెహమాన్ (2/31) వరుస బాల్స్‌లో ఫిన్ అలెన్ (1), రచిన్ రవీంద్ర (0)ను ఔట్ చేసి కివీస్‌కు షాకిచ్చాడు.
14/2 వద్ద వచ్చిన ఫిలిప్స్.. సిఫర్ట్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గ్రౌండ్ నలువైపులా ఫోర్లతో విరుచుకుపడిన ఫిలిప్స్‌ను 10వ ఓవర్‌లో రషీద్ ఖాన్ (1/36) వెనక్కి పంపడంతో మూడో వికెట్‌కు 74 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. సిఫర్ట్ 39 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. చాప్‌మన్ (28)తో నాలుగో వికెట్‌కు 36 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. తర్వాత డారిల్ మిచెల్ (25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్‌కు 31 రన్స్ జోడించి చాప్‌మన్ ఔటైనా.. చివర్లో మిచెల్ శాంట్నర్ (17 నాటౌట్) వేగంగా ఆడి విజయాన్ని అందించాడు. సిఫర్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
నైబ్ ఒక్కడే..
అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో గుల్బదిన్ నైబ్ ఒక్కడే మెరుగ్గా ఆడాడు. 44 రన్స్ జోడించి ఆరో ఓవర్‌లో ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ (10), రెహమానుల్లా గుర్బాజ్ (27) ఔటయ్యారు. ఈ దశలో నైట్ కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. సెదిఖుల్లా అటల్ (29)తో మూడో వికెట్‌కు 79, డార్విష్ రసోలీ (20)తో ఐదో వికెట్‌కు 33 రన్స్ జత చేశాడు. 8 రన్స్ తేడాలో నైబ్, రసోలీ ఔటైనా.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (14), మహ్మద్ నబీ (10 నాటౌట్) వేగంగా ఆడటంతో అఫ్గాన్ మంచి స్కోరును సాధించింది. ఫెర్గుసన్ 2, హెన్రీ, డఫీ, రచిన్ తలా ఓ వికెట్ తీశారు.
