పెళ్లైన రెండు రోజులకే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు విగత జీవులయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 18)న వివాహం కాగా..మంగళవారం రాత్రి రిసెప్షన్ కోసం కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే మరికొద్ది గంటల్లో రిసెప్షన్ ఉందనగా నవ దంపతులు తమ గదిలో శవాలుగా కనిపించారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. ఇద్దరి ఒంటిపై అయితే కత్తిగాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ముందుగా భర్త తన భార్యను పొడిచి చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని బ్రిజన్‌గర్‌లో జరిగింది.
ఘటనకు ముందు ఈ దంపతులు గదిలోకి వెళ్లి తాళం వేసుకొని గొడవపడ్డారని, అరుపులు కేకలు వినిపించాయని కుటంబసభ్యులు చెప్పారు. ఆ సమయంలో లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోడవంతో కిటీకీలో నుంచి చూసే సరికి ఆ ఇద్దరు రక్తపుమడుగులో కన్పించారని వారు పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
