ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత..ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల కు

ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత..ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల కు
  •     నిబంధనల్లో మార్పులు చేస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ 
  •     రేషన్ కార్డు ఉండి 18 నుంచి 59 ఏండ్లలోపువారు చనిపోతే ఈ స్కీమ్​ కింద రూ.20 వేల తక్షణ సాయం 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్​ఎఫ్​బీఎస్​) అమలులో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ పెద్ద చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఫ్యామిలీకి ఈ స్కీమ్ కింద తక్షణ సాయంగా రూ.20 వేల ఆర్థికసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటివరకు ఈ పథకాన్ని ఆర్డీవోలు పర్యవేక్షిస్తుండడంతో సాయం అందడంలో ఆలస్యమవుతోందని గుర్తించిన సర్కారు.. దానిని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల పరిధిలోకి తెచ్చింది.  ఈ మేరకు సెర్ప్ సీఈఓ దివ్యాదేవరాజన్​ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులకు త్వరగా నగదు అందేలా వెబ్ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో కొత్త లాగిన్లను ఏర్పాటు చేశారు. మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ఖాతాల్లో జమ చేయనున్నారు. 

అర్హులు ఎవరంటే..?

ఇంట్లో సంపాదించే వ్యక్తి (ఆడ, మగ) ఎవరు చనిపోయినా ఈ స్కీమ్ కింద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తారు. మరణించిన వ్యక్తి వయస్సు 18 ఏళ్లు నిండి 60 ఏళ్ల లోపు ఉండాలి. తెల్లరేషన్ కార్డు తప్పనిసరి. గతంలో ఆమ్ ఆద్మీ బీమా, జనశ్రీ బీమా లేదా ఆపద్బంధు పథకాల ద్వారా లబ్ధిపొందినవారు దీనికి అనర్హులు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, అనాథలైన పిల్లలకు, ఆడపిల్లలు మాత్రమే ఉన్న పేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్లు (ఎంపీడబ్ల్యూ), ఫీల్డ్ అసిస్టెంట్లుగా (ఎఫ్​ఏ) పనిచేస్తూ చనిపోయినవారి కుటుంబ సభ్యులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

దరఖాస్తు ఇలా..

లబ్ధిదారులు  గతంలో అప్లికేషన్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవస్థలు లేకుండా పెన్షన్ల మాదిరిగానే 'చేయూత’ పోర్టల్ ద్వారా ఎంపీడీవోలే ప్రక్రియను పూర్తి చేసేలా సాఫ్ట్​వేర్​ లో మార్పులు చేశారు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా త్వరగా సాయం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హత ఉన్నవారు మీ-సేవ కేంద్రంలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఆప్లికేషన్లు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ లాగిన్‌‌‌‌‌‌‌‌కు వెళ్తాయి. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసిన తర్వాత  కలెక్టర్ ఆమోదంతో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే నగదును జమ చేస్తారు.