కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు వద్దన్నా ఎట్ల చేస్తున్నరు

కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు వద్దన్నా ఎట్ల చేస్తున్నరు
  •     రాష్ట్ర సర్కార్‌‌ తీరుపై ఎన్జీటీ ఆశ్చర్యం
  •     కేంద్ర మంత్రి లెటర్‌‌ను కూడా పట్టించుకోరా!
  •     ప్రాజెక్టుపై పెండింగ్‌‌ కేసులన్నీ విచారిస్తామని కామెంట్‌‌
  •      ఈనెల 7వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ, వెలుగుకాళేశ్వరం లిఫ్ట్‌‌ విస్తరణ పనులు ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి లెటర్‌‌ రాసినా, రాష్ట్ర సర్కార్‌‌ పనులు చేస్తుండడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌‌లో ఉన్న అన్ని కేసులను విచారిస్తామని చెప్పింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టారంటా సిద్దిపేటకు చెందిన తుమ్మనపల్లి శ్రీనివాస్ సహా పలువురు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్ ఆదర్మ్ కుమార్ గోయల్, జస్టిస్ వాంగ్డి, సబ్జెక్ట్ ఎక్స్‌‌పర్ట్ డాక్టర్ నగిస్ నందాతో కూడిన బెంచ్‌‌ విచారించింది. పిటిషనర్ తరపు లాయర్‌‌ శ్రావణ్ వాదనలు వినిపించారు. కాళేశ్వరం ఎత్తిపోతల విస్తరణ పనులు చేయొద్దని జలశక్తి మంత్రి లెటర్‌‌ రాసినా వర్క్ నడుస్తోందని చెప్పారు. దీనిపై స్పందించిన బెంచ్‌‌ కేంద్ర మంత్రి లెటర్‌‌ రాసినా పనులు చేస్తుండడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేసు విచారణ నవంబరులో చేపడితే ఏమైనా ఇబ్బంది ఉందా అని పిటిషనర్ తరపు లాయర్‌‌ను అడిగింది. తాము జులైలో ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌ను ఆశ్రయిస్తే.. కేసు ప్రిన్సిపల్ బెంచ్‌‌కు బదిలీ కావడానికి ఇంత టైమ్‌‌ పట్టిందని తెలిపారు. అలాగే కేసు బదిలీ కావడం మినహా విచారణలో ఎటువంటి ప్రోగ్రెస్‌‌ లేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. రెండేళ్లలో రాష్ట్ర సర్కార్ రూ.80 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను చేసిందని నివేదించారు. ఇంకా లేటైతే విస్తరణ పనులు కూడా కంప్లీట్‌‌ చేస్తారని తెలిపారు. ఈ వాదనపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వైఖరి ఏమిటో తెలపాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ఇప్పటికే  కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) లెటర్‌‌ రాసినట్లు మంత్రిత్వ శాఖ తరపు లాయర్‌‌ సమీర్ తెలిపారు. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన ధర్మాసనం, కాళేశ్వరంపై దాఖలైన అన్ని పిటిషన్లపై అక్టోబరు 7వ తేదీన విచారిస్తామని చెప్పింది.