
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇప్పటికే బాక్సింగ్లో విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టిను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్లొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. కొత్త సచివాలయంలో నిఖత్ జరీన్ సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఖర్చుల కోసం గాను రూ. 2 కోట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అంతకుముందు నిఖత్ జరీన్‌ను మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు. మే 18వ తేదీ నూతన సచివాలయంలోని మంత్రి మల్లా రెడ్డి ఛాంబర్‌లోతండ్రితో కలిసి నిఖత్ జరీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాక్సర్ నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలియజేసిన మంత్రి మల్లా రెడ్డి.. ఇలాంటి వరల్డ్ ఛాంపియన్ షిప్‌లు మరెన్నో గెలిచి ఇండియా, తెలంగాణ పేర్లను నిలబెట్టాలని ఆకాంక్షించారు. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని బంగారు పథకాలు సాధించాలని కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి ఆకాక్షించారు.
నిఖత్ జరిన్ 50 కేజీల బాక్సింగ్ విభాగం లో స్వర్ణ పతకం సాధించి ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ గా రెండోసారి నిలిచింది. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహం అందించారు. జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం కేటాయించారు.