
నిలోఫర్లో వరుసగా చిన్నారులు మృతి చెందుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ చేరుతున్న చిన్నారులకు వైద్యం ఆలస్యం అవుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో వరుసగా వైద్యుల తీరుపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలే ఇందుకు ఉదాహరణలు. సకాలంలో స్పందించి ఉంటే తమ చిన్నారులు బతికి ఉండేవారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటే ముందుగా గుర్తొచ్చే పేరు నిలోఫర్. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది తల్లితండ్రులు తమ చిన్నారులను ఇక్కడ అడ్మిట్ చేసేందుకు తీసుకొస్తారు. కానీ ప్రస్తుతం అలాంటి వారికి నిరాశ ఎదురవుతోంది. సౌకర్యాల కొరత, వైద్యుల నిర్లక్ష్యం, సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవటం చిన్నారుల తల్లితండ్రులకు శాపంగా మారుతోంది. ఎమర్జెన్సీ సమయంలో పలు విభాగాలకు చెందిన నిపుణులు అందుబాటులో లేకపోవటంతో ఇన్టైం వైద్యం అందటం లేదు. అయితే పరిస్థితి చేయిదాటిన తర్వాతే చాలా మంది చిన్నారులను తీసుకొస్తుండటంతో ఏం చేయలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా నిలోఫర్ కు వచ్చే ఎమర్జెన్సీ కేసుల్లో గుండె సంబంధిత బాధితులు ఎక్కువగా ఉంటారు. రోజులో 50 మందికి పైగా ఇక్కడకు వస్తుంటారు. నెఫ్రాలజీ, ఆర్ధో, కిడ్నీ విభాగాలకు చెందిన స్పెషలిస్టులంతా ఉస్మానియా హాస్పిటల్లోనే ఉంటారు. ఎమర్జెన్సీలో గుండె, నెఫ్రాలజీ, ఆర్ధో, కిడ్ని లాంటి సమస్యలున్న చిన్నారులు వచ్చారంటే వారిని ఉస్మానియా తరలించాల్సి ఉంటోంది. 2డీ ఎకో, ఈసీజీ వంటి టెస్టులు కావాలంటే ఉస్మానియానే దిక్కు. అక్కడకు వెళ్లి టెస్టు చేయించుకొని రిపోర్ట్ తెచ్చే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. ప్రస్తుతం నిలోఫర్ లో ఎక్స్ రే, స్కానింగ్ లాంటివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎమ్.ఆర్.ఐ స్కాన్ అవసరం ఉంటే పక్కనే ఉన్న ఎం.ఎన్.జె. హాస్పిటల్కు వెళ్లాలి. ఈ విధంగా అత్యవసరంగా వైద్యం అందించే సమయంలో ఏ టెస్ట్ కావాలనుకున్నా అందుబాటులో లేని పరిస్థితి ఉంది.
బాగు చేయించడంలోనూ నిర్లక్ష్యమే…
ఇక్కడి సిటీ స్కాన్ దాదాపు15 రోజులుగా పనిచేయటం లేదు. రోజుకు 15 నుంచి 20 సిటీ స్కాన్ లు అవసరముంటాయని డాక్టర్లు చెబుతున్నారు. చాలా వరకు పిల్లల ఆరోగ్య సమస్యలకు సంబంధించి సిటీ స్కాన్ రిపోర్ట్ ఎంతో కీలకం. కానీ 15 రోజులుగా సిటీ స్కాన్ పనిచేయకపోయినా మెయింటెనెన్స్ సంస్థ పట్టించుకోవటం లేదు. హాస్పిటల్ లో పరికరాలకు సంబంధించి ఫైబర్ సింధు సంస్థ మెయింటెనెన్స్ ఉంది. కానీ ఈ సంస్థ పలు కారణాలు చెబుతూ బాగు చేయించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో పక్కనే ఉన్న ఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్ మీద ఆధారపడుతూ నెట్టుకొస్తున్నారు. ఫలితంగా రోగుల బంధువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
సపోర్టింగ్స్టాఫ్ ఏరి?…
చిన్నారుల మృతి ఘటనలు జరుగుతున్నప్పుడు చాలా మంది డాక్టర్లు చెబుతున్న మాట కావాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్ లేరని. ఒక ఎమర్జెన్సీ కేసును ట్రీట్ చేయాలంటే కనీసం 5 నుంచి ఆరు మంది సపోర్టింగ్ స్టాఫ్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా నర్సులు. నిలోఫర్ లో వచ్చే రోగుల సంఖ్యకు ప్రస్తుతం 300 మంది నర్సుల అవసరం ఉంది. కానీ ఉంది 95 మంది మాత్రమే. వీరే డబుల్ డ్యూటీలు, ఎక్స్ ట్రా టైమ్ పనిచేయాల్సి వస్తోంది. అవసరానికి తగిన విధంగా నర్సులు లేక చాలా మంది పిల్లల తల్లితండ్రులు నర్సులుగా మారి వారి పిల్లలకు సేవలు అందిస్తున్నారు. అయితే ఇన్ఫెక్షన్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి తెలియకపోవటంతో చిన్నారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇతర సిబ్బంది కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నారు. పైగా ఎమర్జెన్సీ డ్యూటీలో ఉండే వైద్యులు.. జూనియర్ డాక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని తల్లితండ్రులు ఆరోపణలు చేశారు.
నవజాత శివులకు మరో 3 అవసరం…
ప్రస్తుతం నిలోఫర్ లో ఒక్కటే నవజాత శిశువుల విభాగం ఉంది. చాలా రోజులుగా మరో మూడు యూనిట్లు కావాలని హాస్పిటల్ డాక్టర్లు అడుగుతున్నారు. నిలోఫర్ కు వచ్చేపేషెంట్లను బట్టి ఇక్కడ నాలుగు విభాగాలు అవసరం. కావాల్సినన్ని అందుబాటులో లేక ఉన్న నవజాత శిశువుల విభాగంలోనే సామర్థ్యానికి మించి జాయిన్ చేసి సేవలు అందిస్తున్నారు. నర్సులు కావాల్సినంత మంది లేకపోవటంతో ఇన్ ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునే వారు లేకుండా పోతున్నారు. పేషెంట్ల నుంచి ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.