సీఐఎస్ఎఫ్ తొలి మహిళా చీఫ్​గా నీనా సింగ్

సీఐఎస్ఎఫ్ తొలి మహిళా చీఫ్​గా నీనా సింగ్

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో, సివిల్ ఎయిర్ పోర్టులు, పార్లమెంట్ వంటి కీలక ప్రాంతాలకు సెక్యూరిటీని కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు మొదటి మహిళా చీఫ్ గా నీనా సింగ్ నియామకం అయ్యారు. సీఐఎస్ఎఫ్లో డైరెక్టర్ జనరల్ పదవిలో నియమితులైన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. నీనా సింగ్ వచ్చే ఏడాది జులై 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఆమె సీఐఎస్ఎఫ్ లో 2021 నుంచి ఉన్నారు. ప్రస్తుతం సీఐఎస్ ఎఫ్ స్పెషల్ డీజీగా పని చేస్తున్నారు. కాగా, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హెడ్ గా వ్యవహరిస్తోన్న అనిష్ దయాళ్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) కు డీజీగా నియమితులయ్యారు. 

అంచెలంచెలుగా డీజీ స్థాయికి.. 

నీనా సింగ్ బీహార్ కు చెందిన వారు. పాట్నాలోని విమెన్స్ కాలేజీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో చదువుకున్నారు. హార్వార్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ క్యాడర్ లో1989వ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ గా వెళ్లారు. ఆ రాష్ట్రంలో టాప్ పోలీస్ పోస్ట్ లో నియమితులైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. అప్పట్లో స్టేట్ పోలీస్ ఫోర్స్ లో డైరెక్టర్ జనరల్ ర్యాంకుల్లో ఆరుగురు అధికారులు ఉంటే వారిలో ఆమె ఒకరిగా నిలిచారు. 

2000లో స్టేట్ విమెన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పని చేశారు. ఆమె మెంబర్ గా ఉన్నప్పుడు.. కమిషన్ సభ్యులు జిల్లాలకు వెళ్లి మహిళల సమస్యలపై విచారణ జరిపే ప్రోగ్రామ్ ను  రూపొందించారు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డుఫ్లోలతో కలిసి రెండు రీసెర్చ్ పేపర్స్ కు సహ రచయితగా వ్యవహరించారు. పోలీస్ స్టేషన్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2005 నుంచి 2006లో ఓ ప్రాజెక్టుకు వర్క్ చేశారు. 2013 నుంచి 2018 మధ్య సీబీఐ జేడీగా పని చేశారు. షీనా బోరా మర్డర్, జియా ఖాన్ సూసైడ్ వంటి హై ప్రోపైల్ కేసులను దర్యాప్తు చేశారు. ఆమె భర్త రోహిత్ కుమార్ సింగ్ ఐఏఎస్ ఆఫీసర్.