- వార్డుల వారీగా పట్టివేత
- మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొదలైన కార్యాచరణ
- ఒక్క కోతిని పట్టుకుంటే రూ.500
- ఆంధ్ర నుంచి మంకీ క్యాచర్స్
- మూసివేత దిశగా మంకీ రెస్క్యూ సెంటర్
నిర్మల్, వెలుగు: నిర్మల్ ప్రజలను పట్టిపీడిస్తున్న కోతుల సమస్య తీరనుంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా పట్టణంలోని పలు వార్డుల్లో కోతుల పట్టివేత కొనసాగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్పర్సన్ అప్పాల గణేశ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆంధ్ర నుంచి మంకీ క్యాచర్స్ ను రప్పించారు. వారు ఇప్పటికే దాదాపు 500 కోతులను పట్టుకొని బోనులో వేసి కవ్వాల్ అభయారణ్యానికి తరలించి వదిలేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పట్టణంలో కోతుల సమస్య పూర్తిగా తీరనుందని చైర్పర్సన్ తెలిపారు.
పరిష్కారం దిశగా సమస్య
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కోతుల సమస్య తీవ్రంగా ఉంది. కోతులు విచ్చలవిడిగా గల్లీలో తిరుగుతూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు మహిళలు, పిల్లలు భయపడుతున్నారు. చేతిలో కర్ర లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. కోతుల దాడిలో గాయపడి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు.
కోతుల కారణంగా ఇద్దరు ముగ్గురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. కోతుల గుంపులుగా పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. వాటి బెడదతో రైతులు తమ చేనులకు నిత్యం కాపలా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. రోడ్లపై గుంపులు తిరుగుతూ బీభత్సం సృష్టిస్తూ వాహనాల రాకపోకలకు, పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోతుల సమస్యను పరిష్కరించాలని ప్రజలు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల సమయంలో నేతలను డిమాండ్ చేశారు. ఎన్నికల ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని కోరారు.
పట్టుకున్న కోతి మళ్లీ రాకుండా చర్యలు
ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కోతుల పట్టివేతను ప్రారంభించారు. నిపుణులకు తీసుకొచ్చి ప్రత్యేకంగా రూపొందించిన బోనుల్లో బంధిస్తున్నారు. ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.500 వరకు చెల్లిస్తున్నారు. క్యాచర్స్పట్టుకున్న కోతికి ఎరుపు రంగు కలర్వేసి, వాటిని కవ్వాల్అభయారణ్యానికి తరలిస్తు న్నారు. ఇలా ఎరుపు రంగువేసిన కోతి మళ్లీ పట్టణంలో కనిపించవద్దన్న నిబంధన విధించారు. ఒకవేళ కలర్వేసిన కోతి మళ్లీ పట్టణంలో కనిపిస్తే వారికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించబోమని షరతు పెట్టారు.
మూసివేత దిశగా మంకీ రెస్క్యూ సెంటర్
దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఏకైక మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గండి రామన్న అర్బన్ పార్కులో ఉంది. కోతులకు స్టెరిలైజేషన్ (జనన నియంత్రణ ఆపరేషన్) చేసే ఈ సెంటర్ను మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మంకీ రెస్క్యూ సెంటర్ను మూసివేసేందుకు అనుమతినివ్వాలంటూ నిర్మల్ జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చనీయాంశమవుతుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రీసెస్ మకాక్ జాతి కోతులను ప్రభుత్వం వైల్డ్ లైఫ్ యాక్ట్ షెడ్యూల్ 1 జాబితా నుంచి తొలగించింది. దీంతో రిహాబిలిటేషన్ సెంటర్కు కోతులను తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చు. దీని నిర్వహణ కూడా అధికారులకు భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే సెంటర్ను ఎత్తివేయాలని ఫారెస్ట్ ఆఫీసర్లు భావిస్తున్నారు.
నెల రోజుల్లో సమస్య తీరుతుంది
కోతుల బీభత్సం కారణంగా ఇప్పటివరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అందుకే ఎన్నికల సమయంలో కోతుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. కోతులను పట్టి కవ్వాల్ అభయారణ్యంలో విడిచి పెట్టేందుకు నిర్ణయించాం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంకీ క్యాచర్స్ ను ప్రత్యేకంగా రప్పించాం. నెలరోజుల్లోగా నిర్మల్ లో కోతుల సమస్యకు పరిష్కారం లభించనుంది. అప్పాల గణేశ్ చక్రవర్తి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్

