పాట్నా: బిహార్‌లో తొలిసారిగా ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భారీ మంత్రివర్గ విస్తరణ జరిగింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ సహా మొత్తం 32 మంది నాయకులు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు హాజరయ్యారు. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
గత నెలలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లిన నితీష్ కుమార్, తన కుమారుడు నిశాంత్‌ను కేబినెట్‌లోకి తీసుకురావడం ఈ విస్తరణలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మంత్రివర్గంలో ఎన్డీయే కూటమిలోని ఐదు పార్టీలకు తగిన ప్రాతినిధ్యం లభించింది. అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి 15 మంత్రి పదవులు దక్కగా, జేడీయూ తరపున కూడా 15 మందికి అవకాశం లభించింది.
ఇప్పటికే ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కాకుండా మరో 13 మంది జేడీయూ నేతలు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నుంచి సంజయ్ కుమార్ సింగ్, సంజయ్ కుమార్ పాశ్వాన్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, ఉపేంద్ర కుష్వాహా కుమారుడు దీపక్ ప్రకాష్ కూడా మంత్రివర్గంలో చేరారు. గతేడాది నవంబర్‌లో ఏర్పడిన నితీష్ కేబినెట్‌లోని పాత నాయకులకే కొత్త ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత కల్పించారు. ఈ విస్తరణతో బిహార్ ప్రభుత్వంలో ఎన్డీయే కూటమి పట్టు మరింత బలపడింది.
