ప్రతి 1000 మంది మగ పిల్లలకు 873 మందే

ప్రతి 1000 మంది మగ పిల్లలకు 873 మందే

హైదరాబాద్, వెలుగు: ఆడపిల్లలను కడుపులోనే చిదిమేసే సంస్కృతి రాష్ట్రంలో ఇంకా కొనసాగుతోంది. ఊర్లలో కంటే టౌన్లలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ మధ్య రిలీజైన నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌‌, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో పుడుతున్న మగ, ఆడ పిల్లల నిష్పత్తి 1000: 901గా ఉన్నట్లు నీతి అయోగ్‌‌ వెల్లడించింది. అంటే ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 901 మందే అమ్మాయిలు ఉన్నారు. హెల్త్ ఇండెక్స్‌‌ ఓవర్ ఆల్ ర్యాంకింగ్‌‌లో దేశంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ, ఎస్‌‌ఆర్‌‌‌‌బీ (సెక్స్‌‌ రేషియో ఎట్‌‌ బర్త్‌‌) ఇండెక్స్‌‌లో మాత్రం పదకొండో స్థానంలో ఉంది.

టౌన్లలో మరింతగా..

ప్రతి ఐదేండ్లకు ఒకసారి దేశంలో పిల్లల లింగ నిష్పత్తిని లెక్కిస్తారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌‌ఎఫ్‌‌హెచ్‌‌ఎస్‌‌) ప్రకారం రాష్ట్రంలో 2012 నుంచి 2016 దాకా నమోదైన జననాల్లో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు, 872 మంది ఆడపిల్లలే ఉన్నారు. 2016 నుంచి 2020 మధ్య రికార్డయిన జననాల్లో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 901 మంది ఆడపిల్లలు ఉన్నారు. గతంతో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగైంది. కానీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఆడపిల్లల జననాలు పెరిగాయి. రూరల్‌‌లో అమ్మాయిల రేషియో 864 నుంచి 907కి పెరిగింది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 880 నుంచి 873కి పడిపోయింది.

స్కానింగ్ చేసి.. కడుపులోనే అంతం చేసి..

గర్భంలో ఆడ శిశువులను చిదిమేస్తుండడమే లింగ నిష్పత్తిలో ఉన్న భారీ తేడాకు ముఖ్య కారణమని ఎన్‌‌ఎఫ్‌‌హెచ్‌‌ఎస్‌‌ పేర్కొంది. మన రాష్ట్రంలోని స్కానింగ్ సెంటర్లు వందల సంఖ్యలో పెరిగిపోయాయి. ఆయా సెంటర్లకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే తప్ప, తర్వాత వాటిలో జరిగే వ్యవహారాలపై హెల్త్ ఆఫీసర్ల పర్యవేక్షణ ఉండడం లేదు. ఇదే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు వరంగా మారింది. కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలను తెలుసుకునేందుకు గర్భిణులకు స్కానింగ్‌‌ తప్పనిసరిగా చేయిస్తారు. ఇలా స్కానింగ్ కోసం వచ్చినప్పుడే గర్భిణుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని, కడుపులో ఉన్నది ఆడబిడ్డో, మగబిడ్డో చెప్పేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాదు.. ఉత్తరప్రదేశ్‌‌, ఉత్తరాఖండ్‌‌, హర్యానా, గుజరాత్ వంటి అనేక రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

డెకాయ్‌‌ ఆపరేషన్లేవీ?

లింగ నిర్ధారణ పరీక్షలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులు ఉపయోగించుకుని స్కానింగ్ సెంటర్లపై డెకాయ్‌‌ ఆపరేషన్లు చేసి, లింగ నిర్ధారణ చేసి చెప్పే సెంటర్లపై పీసీపీఎన్‌‌డీటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌‌లో పాల్గొనే గర్భిణికి, ఇతరులకు ప్రోత్సాహకంగా డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మూడేండ్లుగా మన రాష్ట్రంలో ఒక్క డెకాయ్ ఆపరేషన్ కూడా చేపట్టలేదు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్చగా జరుగుతున్నాయి. సిటీల్లో స్కానింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటం కూడా అర్బన్‌‌ ఎస్‌‌ఆర్‌‌‌‌బీపై ప్రభావం చూపుతోందని డాక్టర్లు చెబుతున్నారు. తొలి కాన్పులో ఆడబిడ్డ పుట్టిన వాళ్లు, రెండోసారి గర్భం దాల్చినప్పుడు కడుపులో ఉన్నది ఆడబిడ్డో, మగబిడ్డో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరే సంతానంగా ఉండాలనుకుంటున్న వాళ్లలో ఎక్కువ మంది మగ పిల్లాడే కావాలనుకుంటున్నారు. దీంతో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటున్నారు.

ప్రభుత్వ ధోరణి మారాలి

అర్బన్ ఏరియాల్లో లింగ వివక్ష పెరుగుతోందని మేం ఎప్పట్నుంచో చెబుతున్నాం. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్‌‌ క్లాసులో మగ పిల్లాడే కావాలనుకునే ధోరణి పెరిగిపోయింది. దీని వల్లే రూరల్‌‌లో కంటే, అర్బన్‌‌లో జెండర్ ఇన్‌‌ఈక్వాలిటీ ఎక్కువైంది. కడుపులో ఉన్న బిడ్డ జెండర్‌‌‌‌ ఏంటో తెలుసుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో కంటే, పట్టణాల్లో సులువు కావడం కూడా ఓ కారణమే. కానీ ప్రభుత్వాలు లింగ వివక్ష అనగానే లేబర్ క్లాస్ సమస్యగా చూస్తున్నాయి. ఆ ఆలోచన మారాలి. స్కూలింగ్ నుంచే జెండర్ ఈక్వాలిటీపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి.
- కె.సజయ, 
  విమెన్ అండ్ ట్రాన్స్‌‌ జెండర్ జేఏసీ