బీహార్‌ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. వరుసగా 10వ సారి రికార్డ్..

బీహార్‌ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..  వరుసగా 10వ సారి రికార్డ్..

జనతాదళ్ పార్టీ అధినేత నితీష్ కుమార్ ఈరోజు గురువారం ఉదయం 11:30 గంటలకు బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

గాంధీ మైదాన్ లోనే నితీష్ కుమార్ గతంలో 2005, 2010,  2015లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అంతేకాకుండా 1974లో జయప్రకాష్ నారాయణ్ 'సంపూర్ణ విప్లవం' కోసం ఇచ్చిన పిలుపుకు కూడా ఇది సాక్ష్యంగా నిలిచింది.

ఈ వేడుకకి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా   ఇతర సీనియర్ ఎన్డీఏ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. 

 నిన్న (బుధవారం) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్ జేడీ(యూ) శాసనసభా పక్ష నేతగా, ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ కూడా  శాసనసభా పక్ష నేతగా సామ్రాట్ చౌదరిని, ఉప నేతగా విజయ్ కుమార్ సిన్హాను ఎన్నుకుంది. ఈ ప్రక్రియను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యవేక్షించారు.

74 ఏళ్ల నితీష్ కుమార్‌కు ఈ 2025 అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి.  నవంబర్ 2005 నుండి ఆయన వరుసగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2014–15లో తొమ్మిది నెలల పాటు మాత్రమే ఈ పదవిలో లేరు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో (243 సీట్లలో 202 సీట్లు) ఆయన ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిద్దమయ్యారు. నిన్న బుధవారం ఆయన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కలిసి తన రాజీనామాను కూడా ఇచ్చారు.