‘వ్యవసాయ బిల్లు ఏకపక్షం అయితే.. మ‌రి ఎల్ఆర్ఎస్?’

‘వ్యవసాయ బిల్లు ఏకపక్షం అయితే.. మ‌రి ఎల్ఆర్ఎస్?’

జగిత్యాల: వ్యవసాయ బిల్లు గురించి తెలియ‌క‌ గులాబీ కుక్కలు బాగా మొరుగుతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ‘వ్యవసాయ బిల్లు ఏకపక్షంగా చేసారని అంటున్న కేసీఆర్.. మరి LRS కేసీఆర్ బామ్మర్దిని అడిగి చేసిండా? ‘అని ప్ర‌శ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ విధానంపై రాయికల్ మండల కేంద్రంలో జ‌రిగిన సదస్సులో అర్వింద్ మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టం.. రైతన్న కు ప్ర‌ధాని మోడీ కట్టిన పట్టం అని అన్నారు. నూతన వ్యవసాయ చట్టం అమలైతే దళారీలకు, మధ్యవర్తులకు వచ్చే లాభాలు రైతులకే దక్కుతాయని, రైతులే ప్యాకేజింగ్ యూనిట్ పెట్టుకుంటే కేంద్రం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు.

మొక్కజొన్న, వరి లాగే పసుపు పంటకు తెలంగాణలో ఎందుకు కనీస మద్ధతు ధర ఇవ్వడం లేదు? అని అర్వింద్ ప్ర‌శ్నించారు. దుబాయ్ లో పసుపు ధరకు, ఇక్కడి ధరకు రెట్టింపు వ్యత్యాసముందని, ఇదంతా దళారీలే మింగేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు మామూళ్లు ఇచ్చి రైస్ మిల్లర్లు 10 శాతం రైతుల శ్రమను మింగేస్తున్నారని ఆయ‌న అన్నారు. సీఎం కేసీఆర్ త‌న ఫాం హౌస్ లో పండించిన పంటలు రిలయన్స్ కు అమ్ముకుంటున్నాడ‌ని విమ‌ర్శించారు. నూతన వ్యవసాయ బిల్లుతో పసుపు పంటకు 16వేల రూపాయల ధర దక్కుతుందని, జగిత్యాలకు కాశ్మీర్ నుంచి కూడా వ్యాపారులు వచ్చి పసుపు పంట కొనుక్కుపోతారని అన్నారు.

రెవెన్యూ చట్టం తెస్తే.. ట్రాక్టర్లతో ర్యాలీ అవసరమా? అని ఎంపీ ప్ర‌శ్నించారు. ‘లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిన‌.. పుష్కలంగా నీళ్లున్నాయని చెబుతున్న కేసీఆర్.. ఆరు తడి పంటలు వేసుకోవాలని ఎందుకు చెబుతున్నాడని’ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో 3 లక్షల కోట్ల రూపాయలు నాశనం చేశాడ‌న్నారు. ‘తెలంగాణలో పంటకు ధర లేదు, కరోనాకు ఆరోగ్యశ్రీ లేదు, ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు డబ్బులు లేవు. అందుకే LRS పేరుతో ముఖ్య‌మంత్రి ప్రజలనుంచి డబ్బులు లాగాలని చూస్తున్నాడ‌ని’ అర్వింద్ అన్నారు.