
జగిత్యాల/మెట్పల్లి/కోరుట్ల, వెలుగు: వీఆర్ఏలకు బీజేపీ అండగా ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్ ఎదుట, మెట్పల్లిలో నిరవధిక దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు ఎంపీ సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ 24 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ వీఆర్ఏ జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం బాధాకరం అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసినట్లే వీఆర్ఏలను కూడా కేసీఆర్మోసం చేశారని మండిపడ్డారు. రెండు మూడు నెలల్లో జగిత్యాల టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని, జగిత్యాల నియోజకవర్గం బీజేపీదేనని అర్వింద్అన్నారు. ఇప్పటికే కొంతమంది తనతో టచ్ లో ఉన్నారని, వారితో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.
బహిరంగ సభ విజయవంతం చేయాలె
జగిత్యాల జిల్లా కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో గురువారం మధ్యాహ్నం తలపెట్టిన బీజేపీ భారీ బహిరంగ సభ(డబుల్ ఇంజన్ ధమాకా)ను విజయవంతం చేయాలని ఎంపీ అర్వింద్కోరారు. కోరుట్లలోని సభా ప్రాంగణాన్ని ఎంపీ పరిశీలించారు. ముఖ్య నాయకులతో మాట్లాడి పలు సూచనలిచ్చారు. బహిరంగసభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ హాజరవుతారని, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. దాదాపు 20 వేల మందికి పైగా సభకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అనంతరం ఎంపీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్‌కట్‌చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు.