
న్యూఢిల్లీ: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) 2024–25వ సంవత్సరానికి కొత్తగా10,650 ఎంబీబీఎస్ సీట్లను ఆమోదించింది. కొత్తగా 41 మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య 816కు చేరుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ 2024వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వచ్చే ఐదేండ్లలో 75 వేల మెడికల్ సీట్లను సృష్టిస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఎన్ఎంసీ ఈ సీట్లను ఆమోదించింది.
ఈ సందర్భంగా ఎన్ఎంసీ చీఫ్ డాక్టర్ అభిజాత్ శేఠ్ మాట్లాడారు. ఈ ఏడాది10,650 ఎంబీబీఎస్ సీట్లను ఆమోదించామన్నారు. దీంతో 2024–-25 విద్యా సంవత్సరానికి దేశంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,37,600కి చేరనుందన్నారు. పీజీ కోర్సుల కోసం.. ఎన్‌ఎంసీకి 3,500 కంటే ఎక్కువగా దరఖాస్తులు రాగా.. దాదాపు 5 వేల పీజీ సీట్లు పెరిగాయని వెల్లడించారు.