- 2025–-26 విద్యా సంవత్సరానికి తాత్కాలిక జాబితా వెల్లడి
- అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా చెప్పాలని కాలేజీలకు సూచన
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ సూపర్ స్పెషాలిటీ (డీఎం/ఎం. సీహెచ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కీలక సమాచారం అందించింది. 2025–-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ మెడికల్ కాలేజీలు, విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న తాత్కాలిక సీట్ల వివరాలను ఎన్‌ఎంసీ విడుదల చేసింది.
జాబితాలో తమ కాలేజీ పేరు, కోర్సు, సీట్ల సంఖ్యను సరిచూసుకోవాలని మెడికల్ కాలేజీల యాజమాన్యాలను కోరింది. అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా monitoring.cell@nmc.org.in మెయిల్ కు ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించింది. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే, ఆ డేటా ఆధారంగానే అడ్మిషన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తామని స్పష్టం చేసింది.
కౌన్సెలింగ్‌కు గ్రీన్ సిగ్నల్
సూపర్ స్పెషాలిటీ సీట్లకు సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ)లు జారీ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ఎన్‌ఎంసీ తెలిపింది. అయితే, కౌన్సెలింగ్ నిర్వహించే అథారిటీలు ప్రతి కాలేజీ నుంచి వచ్చే ఎల్‌ఓపీల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేసిన సీట్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని కౌన్సెలింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవచ్చని క్లారిటీ ఇచ్చింది.
ఎన్‌ఎంసీ విడుదల చేసిన 70 పేజీల జాబితాలో మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. నిమ్స్, ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలతో పాటు ఈఎస్ఐ సనత్ నగర్, పలు ప్రైవేట్ కాలేజీల్లోని కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ వంటి విభాగాల్లో ఉన్న సీట్ల వివరాలను వెల్లడించారు.
