- ఇప్పటికీ కనిపించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
- సంగారెడ్డి జిల్లాలో 220 నివాస ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి
- మెదక్, సిద్దిపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాగునీటి అవసరాలపై ముందస్తు యాక్షన్ ప్లాన్ లేకపోవడంతో ఈసారీ కష్టాలు తప్పేలా లేవు. మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యంతో మారుమూల నివాస ప్రాంతాల్లో నీటి కష్టాలు తలెత్తే అవకాశం ఉంది. పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తప్పదని మిషన్ భగీరథ అధ్యయన కమిటీ చెబుతోంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లా పరిధిలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ప్రత్యామ్నాయ చర్యలు కనిపించడం లేదు.
ముందస్తు ప్రణాళికలో జాప్యం
ఎండాకాలం వచ్చినా తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు యాక్షన్ ప్లాన్ తయారుచేయడంలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెలతోపాటు ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. వాటర్ పైప్‌లైన్ల లీకేజీలు, ఇతర రిపేర్లకు కనీసం నెల పట్టే అవకాశం ఉంది. కాగా వేసవి తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టాలని మిషన్ భగీరథ ఉన్నతాధికారులకు ఏఈలకు ఆదేశాలిచ్చారు. దీంతో నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించే పనిలో వారున్నారు. త్రీఫేజ్ పంపులు, చేతి పంపులు, పైపులైన్ల లీకేజీల సమస్యలను తెలుసుకుంటూ.. పరిష్కార మార్గాలపై ఆరా తీస్తున్నారు. బోర్ల రిపేర్లు, ఒకవేళ వాటర్ గ్రిడ్ ఫెయిలై సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా అధ్యయనం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 220 ప్రాంతాలకు నీటి కష్టాలు
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని మారుమూల కంగ్టి, కల్హేర్, నాగలిగిద్ద, సిర్గాపూర్, న్యాల్కల్, రాయికోడ్, మొగుడంపల్లి మండలాల్లో నీటి కష్టాలు తలెత్తే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 852 గ్రామీణ నివాస ప్రాంతాలు ఉండగా, సింగూరు వాటర్ గ్రిడ్ ద్వారా ఆయా గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. సహజంగా ఏటా వేసవికి ముందు తాగునీటి కష్టాల నివారణకు మిషన్ భగీరథ అధికారులు సమ్మర్ ప్లానింగ్ చేయాల్సి ఉంది.
కానీ ఈసారి అలా కాకుండా ప్రణాళికలు ఆలస్యం చేయడంతో తాగునీటి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇప్పటికే వేసవి సమీపించడంతో బాధిత 220 నివాస ప్రాంత ప్రజలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యమ్నయా మార్గాల వైపు అన్వేషించడం మొదలుపెట్టారు.
సిద్దిపేట జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి 20వరకు జిల్లాలోని 508 పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 921 బోర్లకు రిపేర్లు అవసరమని గుర్తించారు. ఇందులో 126 హ్యాండ్ పంపులు, 547 సింగిల్ ఫేజ్ మోటర్లు, 230 త్రీ ఫేజ్ మోటార్లతోపాటు 18 బావులు ఉన్నాయి. వీటి రిపేర్లతో పాటు కొత్త పైప్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చవుతుండగా ఇటీవల మంజూరైన 15వ ఫైనాన్స్ కమిషన్, పంచాయతీ నిధులను ఖర్చు చేయనున్నారు. మార్చి 15లోగా రిపేర్లు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 1,515 ఓవర్ హెడ్ ట్యాంకులు 2,793.43 కిలో మీటర్ల పైప్ లైన్ ద్వారా2.06లక్షల గృహాలకు నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం
వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. వేసవి తాగునీటి ప్రణాళిక ప్రకారం సమస్యలు ఉన్న గ్రామాలను ఇప్పటికే గుర్తించాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దాదాపు చివరి దశకు వచ్చాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా సమస్య తీవ్రతరం కాకుండా చూస్తూ అవసరమైన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నాం.
-పాష, మిషన్ భగీరథ ఈఈ, సంగారెడ్డి జిల్లా
