
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) అమల్లో భాగంగా తెలం గాణలోని పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 16 ట్రైనింగ్ సెంటర్లను ఎంప్యానల్ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. అయితే, ప్రస్తు తం అమలులో ఉన్న పీఎంకేవీవై 4.0 కింద పెద్దపల్లి జిల్లాలో ఒక్క శిక్షణ కేంద్రం కూడా పని చేయడం లేదని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి వెల్లడించారు. లోక్సభలో సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2025, జూన్ 30 నాటికి పెద్దపల్లి జిల్లాలో ఈ స్కీం
ప్రారంభమైన నాటి నుంచి రూ.1.81 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. అయితే, ఈ పథకం కింద జిల్లావారీగా నిధుల కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది. 2015–16 నుంచి 2021–22 మధ్య కాలంలో అమలైన ఈ స్కీం ద్వారా పెద్దపల్లి జిల్లాలో మొత్తం 229 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని చెప్పారు.