నిధులు లేవ్.. అధికారాలు లేవ్.. ఏం చేయలేకపోతున్నాం..

నిధులు లేవ్.. అధికారాలు లేవ్.. ఏం చేయలేకపోతున్నాం..

మా సమస్యలు పరిష్కరించండి.. ఎంపీ కేకేకు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీటీసీలకు నిధులు, అధికారాలు ఉండేవని…తెలంగాణ వచ్చాక ఈ రెండు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ, కె. కేశవరావును కలిసి 20 డిమాండ్లతో కూడిన  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  కేకే ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎంపీటీసీల సమస్యలు, నిధులపై అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని శైలజ గుర్తుచేశారు. 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన అధికారాలను ఎంపీటీసీలకు బదిలీ చేయాలని, ఏటా రూ.10 లక్షలు డెవలప్ మెంట్ ఫండ్ ను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపీటీసీలకు 25 శాతం నిధులు ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ కేంద్రానికి 10 శాతమే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని కేకే ను కోరారు. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారని ఎంపీటీసీల సంఘం తెలిపింది. పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.