పైసల్లేవ్​.. పనుల్లేవ్​!

పైసల్లేవ్​.. పనుల్లేవ్​!

మంచిర్యాల, వెలుగు: తండాలు, గూడేలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడితే డెవలప్​మెంట్​ జరుగుతుందనుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. రాజకీయంగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ పదవులు వచ్చాయే తప్ప పల్లెల్లో ఆశించిన అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. నేటికీ అనేక గ్రామ పంచాయతీలకు బిల్డింగులు కూడా లేకపోవడంతో చిన్న చిన్న షెడ్లలో సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సర్కారు ఇస్తున్న ఫండ్స్ శానిటేషన్ వర్కర్లకు, కరెంట్ బిల్లులకు, ట్రాక్టర్ల ఈఎంఐలకు కూడా చాలక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్లలో ఏవేవో చేస్తామని హామీలిచ్చి గెలిచామని, ఇప్పుడు ప్రజల ముందు తల దించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రూ.50 వేల నుంచి రూ.లక్షలోపే..
సెంట్రల్ గవర్నమెంట్ 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఫండ్స్​విడుదల చేస్తోంది. 14వ ఫైనాన్స్ కమిషన్ టైమ్​లో వంద శాతం నిధులు నేరుగా పంచాయతీలకే ఇవ్వగా, ప్రస్తుతం మండల పరిషత్​లకు 10 శాతం, జిల్లా పరిషత్​లకు 5 శాతం కేటాయిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ప్రతి నెల గ్రామ పంచాయతీలకు రూ.329 కోట్లు రిలీజ్ చేస్తోంది. 500 నుంచి వెయ్యిలోపు జనాభా ఉన్న పంచాయతీలకు అన్నీ కలిపి రూ.50 వేల నుంచి రూ.లక్ష మాత్రమే వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో మొత్తం 311 పంచాయతీలకు గాను వెయ్యిలోపు జనాభా గల జీపీలు సుమారు 125 ఉన్నాయి. మిగతా జిల్లాలోనూ ఇంచుమించు ఇదే సంఖ్యలో మైనర్ పంచాయతీలు ఉండగా, ఇందులో మెజారిటీ కొత్త జీపీలే కావడం గమనార్హం. ప్రభుత్వాలు 2011 సెన్సెస్ ప్రకారం జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నాయి. గత పదకొండేళ్లలో జనాభా రెట్టింపు అయినప్పటికీ ఆ మేరకు ఫండ్స్ రాకపోవడంతో ఇబ్బందిగా మారింది. 

నిధులు లేక సర్పంచుల పరేషాన్​ 
మైనర్ జీపీల్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, తాగునీరు, శానిటేషన్ వంటి కనీస సౌలత్​లకు తక్లీఫ్ ఉన్నప్పటికీ నిధులు లేకపోవడంతో సర్పంచులు ఏమీ చేయలేకపోతున్నారు. మంచిర్యాల జిల్లా కాసిసేట మండలం సోమగూడెం(కె) పంచాయతీ ప్రస్తుత జనాభా రెండు వేలు. 2011 సెన్సెస్ ప్రకారం 700 మాత్రమే. నేటికీ 2011 సెన్సెస్ ప్రకారమే ఫండ్స్ కేటాయిస్తున్నారు. గతంలో ఈ పంచాయతీకి రూ.లక్ష 20 వేలు వచ్చేది. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి మండల పరిషత్​లకు 10 శాతం, జిల్లా పరిషత్​లకు  5 శాతం కేటాయించడంతో రూ.90 వేలకు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​బడ్జెట్, ఇతర స్కీంల పేరిట మరో రూ.30 వేలు కోత పెట్టింది. ప్రస్తుతం నెలకు రూ.60 వేలు మాత్రమే వస్తున్నాయి.  ఇందులోంచి ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు రూ.17 వేలు, కరెంట్ బిల్లు రూ.20 వేలు, ట్రాక్టర్ ఈఎంఐ, మెయింటెనెన్స్​ రూ.20 వేలు చెల్లిస్తున్నారు. ఇక పంచాయతీలో చిన్న చిన్న పనులు చేద్దామన్నా పైసా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తలకు మించిన భారంగా ట్రాక్టర్లు
రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను కొనుగోలు చేయాలని ఆదేశించింది. కొన్ని మేజర్ పంచాయతీల్లో జనరల్ ఫండ్, ఇతర నిధులు నిల్వ ఉండడంతో వందశాతం పేమెంట్ చేసి ట్రాక్టర్లు కొన్నారు. మరికొన్ని పెద్ద పంచాయతీల్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ పేమెంట్ చేశారు. మైనర్ జీపీల్లో ఫండ్స్ లేకపోవడం వల్ల కేవలం డౌన్ పేమెంట్ కట్టి మిగతా మొత్తం బ్యాంక్ లోన్ పెట్టారు. మూన్నెల్లకోసారి రూ.35 వేల నుంచి రూ.50 వేలు ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క వాయిదా తప్పినా బ్యాంకర్లు ఈఎంఐపై వడ్డీ లెక్కగట్టి వసూలు చేస్తున్నారు. చిన్న పంచాయతీలకు ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లింపులు, వాటి మెయింటెనెన్స్​ఖర్చులు తలకు మించిన భారంగా మారాయని  సర్పంచులు వాపోతున్నారు. 

ఫండ్స్ ఫ్రీజింగ్​తో లొల్లి
పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చేదే అరకొర ఫండ్స్ కాగా, వాటిపై ఫ్రీజింగ్ పెడుతున్నారు. గ్రామాల్లో అత్యవసరంగా పనులు చేసి బిల్లులు పెడితే మూడు నాలుగు నెలలకు గానీ చెక్కులు క్లియర్ కావడం లేదని సర్పంచులు పేర్కొంటున్నారు. పంచాయతీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయినట్టు చూపిస్తున్నా బిల్స్ మాత్రం రావడం లేదని చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా సోమగూడెం(కె) సర్పంచ్ రూ. 4 లక్షల వర్క్ చేసి నాలుగు నెలల కిందట బిల్స్ పెట్టినా ఇంతవరకు పైసలు రాలేదు. ఇటీవల భీమారం మండలం మద్దికల్ పంచాయతీలో వర్క్ చేసిన కాంట్రాక్టర్​నెలలు గడుస్తున్నా బిల్లు రాకపోవడంతో సెక్రటరీపై దాడి చేశాడు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిద్దాపూర్ పంచాయతీ ట్రాక్టర్ ఈఎంఐ చెక్​  ట్రెజరీలో జమ చేశారు. ఆ చెక్ క్లియర్ కాకపోవడంతో అంతకుముందు అక్కడ పనిచేసిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ పర్సనల్ అకౌంట్ నుంచి బ్యాంక్ ఆఫీసర్లు రూ.37 వేలు కట్ చేసుకున్నారు. భార్య డెలివరీ కోసం అప్పు చేసి అకౌంట్​లో దాచుకున్న పైసలు తనకు చెప్పకుండానే తీసుకున్నారని సెక్రటరీ వాపోయాడు. అదే మండలం తుమ్మగూడ పంచాయతీ సెక్రటరీ అకౌంట్ నుంచి సైతం డిసెంబర్ 4న రూ.29 వేలు, ఫిబ్రవరి 15న మరో రూ.9,714 బ్యాంకర్లు కట్ చేసుకున్నారు. ప్రతి నెల 5లోగా ట్రాక్టర్ ఈఎంఐ చెల్లించాల్సి ఉండగా, చెక్కులు సకాలంలో క్లియర్ కాకపోవడంతో సెక్రటరీల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.