పాడి రైతులకు ఇన్సెంటివ్ ఇయ్యట్లే

V6 Velugu Posted on Sep 16, 2020

2019 జనవరి నుంచి ఫండ్స్ రిలీజ్ చేయని ప్రభుత్వం

పల్లెల్లో పాల సేకరణకు విజయ డెయిరీకి తప్పని ఇబ్బందులు

బకాయిలను వెంటనే అందించాలంటున్న రైతుల

మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపును అమలు చేయడంలో భాగంగా పాడి రైతులకు ప్రతీ లీటర్ కు రూ.4 ఇన్సెంటివ్ అందించాలని 2017లో నిర్ణయించాయి. సంవత్సరం పాటు ప్రతీ నెల క్రమం తప్పకుండా ఇన్సెంటివ్ రైతులకు అందింది . 2019 జనవరి నుంచి ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పాల సేకరణ కు కష్టా లు తప్పడం లేదు. ప్రైవేట్ డెయిరీ మేనేజ్ మెంట్లు రైతులకు లీటర్‌‌‌‌కు రూ.50 వరకు చెల్లిస్తూ ఉంటారు. వారి పోటీని తట్టుకుని నిలబడడం ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ నిర్వహణ కష్టతరమవుతోంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి..

విజయ డెయిరీకి ఉమ్మడి జిల్లాలో 7,200 మంది రైతులు పాలుపోస్తున్నారు. తొర్రూరు, మహబూబాబాద్, వరంగల్, నర్సం పేట, సంగెం, ధర్మసాగర్, ములుగు, ఏటూరునాగారం డెయిరీలు ఉన్నాయి. వీరికి ప్రభుత్వం తరఫున కనిష్ఠంగా వెన్న శాతం గేదె పాలలో 8 శాతం ఉంటే లీటర్ కు రూ.29.8 ఇస్తుండగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో కలుపుకొని రూ.33.8 చెల్లిస్తారు. వెన్న శాతం 9.7 శాతం ఉంటే అత్యధికంగా లీటర్ కు రూ.51 వరకు ఇస్తున్నారు. ఆవు పాలకు లీటర్ కు రూ. 27.37 వెన్న శాతం 3 ఉంటే చెల్లింపు చేయగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో లీటర్ కు రూ.31.37 దక్కుతుంది. వెన్న శాతాన్నిబట్టి ధరను ఇంకా ఎక్కువగా ఇస్తారు. అయితే 2019 జనవరి నుంచి ఇన్సెంటివ్ ఇవ్వకపోవడంతో ఉమ్మడి జిల్లా రైతులకు రూ.2.05 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పాల సేకరణ కోఆర్డినేటర్లతో పాడి రైతులకు గొడవలు జరుగుతున్నాయి.

వెంటనే ఇవ్వాలె..
ఇన్సెంటివ్ రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాల సేకరణ కష్టంగా మారింది. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి వెంటనే ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలి. – రాసాల సమ్మయ్య, తొర్రూరు డెయిరీ చైర్మన్.

ప్రభుత్వం నుంచి నిధులు రావాలి..
విజయ డెయిరీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,200 మంది రైతులు పాలు పోస్తున్నారు. పెండింగ్ బకాయిలు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే ఆయా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తాం. -ప్రవీణ్, డెయిరీ డీడీ, వరంగల్ ఉమ్మడి జిల్లా.

 

Tagged Warangal, latest, updates, Today, milk, mahaboobabad, Farmer's, details, production, vijaya dairy, District, ryths, incentive

Latest Videos

Subscribe Now

More News