ట్రంప్ వివాదాస్పద విధానాలకు వ్యతిరేకంగా యూఎస్లోని 3 వేల సిటీల్లో నో కింగ్స్ ర్యాలీలు

ట్రంప్ వివాదాస్పద విధానాలకు వ్యతిరేకంగా యూఎస్లోని 3 వేల సిటీల్లో నో కింగ్స్ ర్యాలీలు
  • 50 రాష్ట్రాల్లోని నిరసనల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న జనం
  • ఇరాన్ యుద్ధం, ఇమిగ్రేషన్ పాలసీలపై ప్రజాగ్రహం
  • అమెరికా స్వేచ్ఛకు ట్రంప్ ముప్పు.. నటుడు రాబర్ట్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వివాదాస్పద విధానాలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో సుమారు 3,200 నగరాల్లో "నో కింగ్స్" అనే నినాదంతో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. ప్రధానంగా ఇరాన్ సంక్షోభం, కఠినమైన వలస విధానాలు, అక్రమ వలసదారుల ఏరివేత వంటి అంశాలపై ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు కేవలం న్యూయార్క్, వాషింగ్టన్ వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించడం గమనార్హం.

గతంతో పోలిస్తే ఈసారి చిన్న కమ్యూనిటీలలో నిరసనల సంఖ్య 40 శాతం పెరిగిందని నిర్వహకులు తెలిపారు. మిన్నెసోటాలో జరిగిన భారీ ప్రదర్శనలో గవర్నర్ టిమ్ వాల్జ్ పాల్గొని, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. అమెరికాను నిరంకుశ పాలన వైపు వెళ్లకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, ప్రముఖ సెనేటర్ బెర్నీ సాండర్స్, నటుడు రాబర్ట్ డి నీరో వంటి ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. 

న్యూయార్క్‌‌లో జరిగిన సభలో డి నీరో మాట్లాడుతూ, అమెరికా స్వేచ్ఛకు ట్రంప్ ఒక ముప్పుగా పరిణమించారని ఆందోళన వ్యక్తం చేశారు. డల్లాస్ వంటి నగరాల్లో నిరసనకారులకు, ట్రంప్ మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకోగా, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

రాబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ నిరసనలు ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. రాయిటర్స్ సర్వే ప్రకారం ట్రంప్ ప్రజాదరణ 36 శాతానికి పడిపోవడం, రిపబ్లికన్ పార్టీకి గట్టి పట్టున్న రాష్ట్రాల్లో కూడా ప్రజలు అధిక సంఖ్యలో నిరసన ర్యాలీల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, రిపబ్లికన్ పార్టీ ఈ నిరసనలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి కేవలం వామపక్ష ఉన్మాద చర్యలని కొట్టిపారేసింది.