మాస్కులు లేవు​.. దూరం లేదు.. జాగ్రత్తలు లేకుండానే ఆస్తుల సర్వే

మాస్కులు లేవు​.. దూరం లేదు..  జాగ్రత్తలు లేకుండానే ఆస్తుల సర్వే

కరోనా పేషెంట్లున్న ఇళ్లకూ వెళుతున్న సిబ్బంది

ఒక్కో ఇంట్లో అరగంట దాకా వివరాల సేకరణ

కరోనా మరింత విస్తరించే ముప్పుందన్న ఆందోళన

జగిత్యాల, వెలుగు: ఓ వైపు కరోనా కేసులు రోజూ పెరిగిపోతున్నా.. ఆస్తులపై ఇల్లిల్లూ సర్వే చేయిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సర్వే చేస్తున్న సిబ్బంది కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రతి ఇంట్లోనూ సర్వే చేస్తున్నారు. వాళ్ల దగ్గర కనీసం మాస్కులు కూడా ఉండట్లేదు. శానిటైజర్లు వాడట్లేదు. సోషల్​ డిస్టెన్స్​నూ పాటించట్లేదు. కరోనా పేషెంట్లున్న ఇంట్లోనూ సర్వే చేస్తున్న సిబ్బంది.. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇళ్లకూ వెళుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తిని ఈ సర్వే మరింత ఎక్కువ చేస్తుందన్న విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. సిబ్బందే కాదు.. ఇటు జనాలు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. సర్వే సిబ్బందితో మాస్కులు లేకుండానే మాట్లాడుతున్నారు.

భయం భయంగనే..

రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు, 12,761 పంచాయతీల్లో వ్యవసాయేతర ఆస్తులపై అధికారులు సర్వే చేస్తున్నారు. ఆ సర్వేని పూర్తి చేసేందుకు సర్కారు పెట్టిన గడువు జస్ట్​ పది రోజులే. ఒక ఊర్లో కనీసం రోజుకు 70 నుంచి 80 ఇళ్లను సర్వే చేయాలన్న టార్గెట్​ పెట్టింది. అయితే, ఇంత తక్కువ టైంలో పని పూర్తవుతుందో లేదో తెలియక ఆందోళన చెందుతున్న సిబ్బంది.. ఇటు కరోనా భయంతోనూ హడావుడిగా సర్వే పని కానిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. కరోనా వచ్చిన వాళ్లలో చాలా మందిని హోం ఐసోలేషన్​లోనే ఉంచుతోంది సర్కారు. సర్వే సిబ్బంది వాళ్ల ఇళ్లకూ వెళ్లి ఆస్తులపై సర్వే చేస్తున్నారు. ఏ ఇంట్లో పాజిటివ్​ వచ్చినోళ్లు ఉన్నారో తెలియక సిబ్బంది భయం భయంగానే ఇళ్లకు వెళుతున్నారు. 80 ఇళ్ల దాకా టార్గెట్​ పెట్టినా.. రోజూ 25 నుంచి 30 ఇండ్లను సర్వే చేస్తున్నారు. ఒక్కో ఇంట్లో అరగంట దాకా ఉంటున్నారు. అన్ని వివరాలు తీసుకుంటున్నారు. కొందరు మాస్కులు పెట్టుకోకుండానే ఇంటోళ్లతోటి మాట్లాడుతున్నారు. చాలా దగ్గరగా ఉండి వివరాలు తీసుకుంటున్నారు. దీంతో ఏదైనా ఇంట్లో కరోనా పాజిటివ్​ వ్యక్తులుండి.. ఆ ఇంట్లో సిబ్బంది సర్వే చేస్తే అక్కడి నుంచి వేరే ఇళ్లకు కరోనా సోకే ముప్పు ఉంటుందని ఇటు జనంతో పాటు అటు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నం

సర్కారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కరోనా రూల్స్​ను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటింటి సర్వే చేస్తున్నాం. కరోనా పాజిటివ్​ వ్యక్తులున్న ఇండ్లను ఆపాలన్న రూల్​ లేదు. అన్ని ఇళ్లనూ సర్వే చేయాలని సర్కారు నుంచి ఆదేశాలున్నాయి. గడువు లోపు సర్వేని పూర్తి చేయాల్సి ఉంది.
– మారుతీ ప్రసాద్​, జగిత్యాల మున్సిపల్​ కమిషనర్​

For More News..

‘స్వదేశీ ఆందోళ‌‌‌‌‌‌‌‌న్’ చేపట్టాలి: గవర్నర్ తమిళిసై

రాత్రి దాకా పని చేయించుకొని.. పొద్దుగాల పనిలోంచి తీసేసిన్రు

పోలీస్​ ఆఫీసర్ల పేరుతో 350 నకిలీ ఫేస్​బుక్‌లు