మూడేండ్లవుతున్నా అందని సబ్సిడీ
పైలట్ ప్రాజెక్టుగా సూర్యాపేట జిల్లా
829 మంది ఎంపిక బ్యాంకు లోన్లతోనే రెండేసి బర్రెల కొనుగోలు
ఆస్తులు తనఖా పెట్టి కొన్న లబ్ధిదారులు
సూర్యాపేట, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ రైతులకు పాడి యూనిట్లు మంజూరు చేస్తామంటూ సూర్యాపేట నియోజకవర్గాన్ని పైలట్‌ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సర్కారు మూడేండ్లవుతున్నా పైసా సబ్సిడీ కూడా విడుదల చేయలేదు. ప్రతి యూనిట్‌లో రూ.4 లక్షలతో నాలుగు బర్రెలను ఇవ్వాల్సి ఉంది. అయితే సర్కారు సబ్సిడీ విడుదల చేయకపోవడంతో బ్యాంకు లోన్రూ.1.60 లక్షలతో రెండు బర్రెలను మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన బర్రెల కోసం లబ్ధిదారులు అడిగితే రెండో విడతలో పంపిణీ చేస్తామని ఆఫీసర్లు సమాధానం ఇస్తున్నారు.
అరెకరం ఉన్న రైతుల ఎంపిక
సూర్యాపేట నియోజకవర్గంలో 2018లో పాడి స్కీమ్‌ను సర్కారు ప్రారంభించింది. పెన్ పహాడ్, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, సూర్యాపేట మండలాల్లో కనీసం అరెకరం భూమి ఉన్న 829 మంది ఎస్సీలను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామంలో ఒక సొసైటీ ఏర్పాటు చేసి అందులోని సభ్యులందరికీ 4 పాడి బర్రెలను మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ కింద ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రూ.2.4 లక్షలు కాగా రూ. 1.6 లక్షలు బ్యాంక్ లోన్ ఇప్పిస్తామన్నారు. బర్రెలకు బీమాతోపాటు రైతుల ఇళ్లకు చేర్చేందుకు అయ్యే రవాణా ఖర్చు కూడా ఎస్సీ కార్పొరేషన్ భరిస్తుందని, అలాగే పశుసంవర్థక శాఖ ద్వారా దాణాను పంపిణీ చేస్తామని చెప్పారు. స్కీమ్ ప్రారంభించి మూడేండ్లు గడుస్తున్నా నేటికీ 398 మంది లబ్ధిదారులకు మాత్రమే అదీ రెండు బర్రెల చొప్పున మహారాష్ట్ర నుంచి తెచ్చి పంపిణీ చేశారు. సర్కారు నుంచి సబ్సిడీ రాకపోవడంతో మిగతా రెండు బర్రెలను ఇవ్వలేదు. రూ.4 లక్షల యూనిట్ విలువలో రూ.2.4 లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది లబ్ధిదారులు వారి ఆస్తులను తనఖా పెట్టి మరీ లోన్లు తీసుకున్నారు. తీరా ఇప్పుడు రెండు బర్రెలను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు అసలు సబ్సిడీ వస్తుందా రాదా అన్న ఆందోళనలో ఉన్నారు. తమ డబ్బులతోనే బర్రెలను పంపిణీ చేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
రెండో విడతలో పంపిణీ చేస్తాం
లోన్లు తీసుకున్న వారికి మొదటి విడతలో రెండు బర్రెలను పంపిణీ చేశాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాగానే రెండో విడత బర్రెలను మంజూరు చేస్తాం. 829 మంది లబ్ధిదారుల్లో 621 మందికి మాత్రమే మంజూరు చేస్తున్నాం. సిబిల్ స్కోర్ఆధారంగా మిగిలిన వారిని బ్యాంకర్లు రిజెక్ట్ చేశారు. – శిరీష, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, సూర్యాపేట
లోన్ పైసలతో రెండు బర్రెలు ఇచ్చిన్రు
ప్రభుత్వం రూ.4 లక్షలతో బర్రెలను పంపిణీ చేస్తుందని, 60 శాతం సబ్సిడీ ఇస్తామని చెబితే బ్యాంకులో లోన్కోసం అప్లై చేశా. ఎకరంన్నర పొలం తనఖా పెట్టుకుని లోన్ మంజూరు చేశారు. ఆ డబ్బుతోనే రెండు బర్రెలను పంపిణీ చేశారు. మిగిలిన బర్రెల కోసం అడిగితే రెండో విడతలో వస్తాయని చెబుతున్నరు. – సిరిపంగి పున్నమ్మ, ఖాశింపేట, సూర్యాపేట
