ఎమ్మెల్సీ నామినేషన్లలో ర్యాలీలకు నో పర్మిషన్

ఎమ్మెల్సీ నామినేషన్లలో ర్యాలీలకు నో పర్మిషన్
  • లోకల్​ కోటాలో  12 స్థానాలకు షెడ్యూల్ రిలీజ్
  • ఈ నెల 16న నోటిఫికేషన్​.. 
  • వచ్చే నెల 10న పోలింగ్.. 
  • 14న కౌంటింగ్​
  • హైదరాబాద్​ మినహా అన్ని జిల్లాల్లో కోడ్​
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు నోటిఫికేషన్ ​విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఎన్నికల హడావుడి మొదలైంది. లోకల్​ బాడీస్​ కోటాకు సంబంధించి రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్​ కమిషన్ మంగళవారం షెడ్యూల్​ విడుదల చేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలవుతుందని, డిసెంబర్​10న పోలింగ్ జరుగుతుందని తెలిపింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్​ కోడ్ లెక్కనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ​ఉంటుందని సీఈవో శశాంక్​ గోయల్​తెలిపారు. హైదరాబాద్​ మినహా రాష్ట్రమంతా కోడ్ అమల్లో ఉంటుందన్నారు. రోడ్​షోలకు అనుమతి లేదని, పాదయాత్ర, ఇతర ర్యాలీలకు జిల్లా కలెక్టర్​అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనిపై కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని, ఏర్పాట్లపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నామని చెప్పారు. తెలంగాణతో పాటు  ఏపీలోని 8 జిల్లాల్లో 11 స్థానాలకు ఈసీ ఎలక్షన్ షెడ్యూల్​ రిలీజ్ చేసింది.
జనవరి 4తో ముగియనున్న పదవీకాలం
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే జనవరి 4తో పదవీకాలం ముగుస్తుండడంతోఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు  జిల్లాల్లో రెండేసి స్థానాలకు చొప్పున.. 6 జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి పురాణం సతీశ్ కుమార్, వరంగల్ జిల్లా నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి తేరా చిన్నపరెడ్డి, మెదక్ జిల్లా నుంచి భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఖమ్మం జిల్లా నుంచి బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుంచి భానుప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌రావు, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు ఉన్నారు.
23 వరకు నామినేషన్లు
లోకల్ బాడీస్​ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది. 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 26 వరకు విత్ డ్రాకు చాన్స్‌‌‌‌ ఇచ్చారు. డిసెంబర్ 10 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​,14న కౌంటింగ్ జరుగుతుంది.  
9,835 మంది ఓటర్లు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. 12 స్థానాల్లో 9,971 మంది ఓటర్లున్నారని సీఈవో ఆఫీస్ ​మంగళవారం ప్రకటించింది. ఆదిలాబాద్‌‌‌‌లో 931, వరంగల్ 1,021, నల్గొండ 1,271, మెదక్ 1,015, నిజామాబాద్ 809, ఖమ్మం 769, కరీంనగర్ 1,323, మహబూబ్ నగర్ 1,394, రంగారెడ్డిలో 1,302 మంది ఓటర్లున్నారు. పార్టీల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నా గుర్తులకు బదులు అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు
ఇప్పటికే షెడ్యూల్​ రిలీజైన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ కోటాలో 6 స్థానాలు ఖాళీ అయ్యాయి. 16 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 22 వరకు విత్ డ్రాకు అవకాశం, 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి రిజల్ట్​ ప్రకటిస్తారు.
నామినేషన్లలో ర్యాలీలుండవ్​
రాజకీయ పార్టీల నేతలు, ఓటర్లందరూ కరోనా రూల్స్, మోడల్ కోడ్‌ పాటించాలని సీఈవో శశాంక్ ​గోయల్​ తెలిపారు. ఔట్ డోర్​లో 500 మంది కంటే ఎక్కువ మందితో ప్రచార సభలు, సమావేశాలు పెట్టొద్దన్నారు. స్ర్టీట్ మీటింగ్​లైతే 50 మందికి అనుమతి ఉందన్నారు. సభలు సమావేశాలకు అనుమతి లేదన్నారు. నామినేషన్లలో ర్యాలీలు ఉండవని, అభ్యర్థుల వాహనాలకే అనుమతి ఉంటుందని చెప్పారు. ఓటర్లు, ఎలక్షన్ స్టాఫ్​ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలని తెలిపారు.