కొత్త జిల్లాల్లో పోస్టుల్లేవ్!

కొత్త జిల్లాల్లో పోస్టుల్లేవ్!
  • కేడర్​ స్ట్రెంత్ ఫైనలైజేషన్​లో ఉన్నోళ్లనే సర్దాలని ఆదేశాలు 
  • నిరుద్యోగుల ఆశలపై నీళ్లు.. కనీసం 23 వేల కొత్త పోస్టులు అవసరం 
  • అనేక డిపార్ట్​మెంట్లలో ఖాళీ కుర్చీలే దర్శనం
  • పనులుగాక జనం తిప్పలు..శాంక్షన్డ్ కొలువులు పెంచని రాష్ట్ర సర్కారు


కొత్త జిల్లాలు ఏర్పడినప్పటి నుంచి పాత జిల్లాల ఉద్యోగులనే అన్ని జిల్లాల్లో సర్దుబాటు చేస్తూ పాలన సాగిస్తున్నారు.  తగిన సంఖ్యలో ఉద్యోగులు లేకపోవడంతో ఇబ్బందవు తోందని,  శాంక్షన్డ్​ పోస్టులు పెంచాలని జిల్లాల అధికారుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లాయి. ప్రెసిడెన్షియల్​ ఆర్డర్​ తర్వాత  శాంక్షన్డ్​ పోస్టులు పెంచుతామని అప్పట్లో చెప్పిన సర్కారు ఇప్పుడు చేతులెత్తేసింది. గతంలో సర్దుబాటు చేసుకున్నట్లుగానే  ఇప్పుడూ అడ్జెస్ట్​ చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఒక్కో కొత్త జిల్లాకు కనీసం వెయ్యి పోస్టులైనా శాంక్షన్​ అవుతాయని, ఈ లెక్కన 23 కొత్త జిల్లాలకు కలిపి 23 వేలకు పైగా శాంక్షన్డ్​ పోస్టులు వస్తాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. 
హైదరాబాద్​, వెలుగు: నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్​ మరో షాక్​ ఇచ్చింది. ఇప్పటికే డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ పోస్టుల ఖాళీల గుర్తింపు, రిక్రూట్​మెంట్​ను ఆలస్యం చేస్తుండగా... కొత్త జిల్లాల ఏర్పాటుతో వేల సంఖ్యలో కొత్తగా శాంక్షన్డ్​ పోస్టులు వస్తాయనుకుంటే ఆ ఆశలపైనా నీళ్లు చల్లింది. ఉన్నవారితోనే సర్దుబాటు చేసుకోవాలని ఆదేశించింది. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, దీంతో కొత్త పోస్టులు వస్తాయని ఇన్నాళ్లూ ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తకుండా కేడర్​ స్ట్రెంత్ ​​ప్రక్రియను కానిచ్చేస్తోంది. ఏ జోన్​లో  ఏ పోస్టు ఉండాలనే దానిపై ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. 
మొదటి నుంచి ఇబ్బందులే
రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలతోపాటు మండలాలు ఏర్పాటు అయ్యాయి. వీటిని ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు, పాత మండల కేంద్రాల నుంచి ఎంప్లాయీస్​నే కొత్త వాటిల్లోకి అడ్జస్ట్​ చేశారు. అప్పుడే అనేక ఇబ్బందులు రావడంతో దాదాపు రెండు వేల పోస్టులను ఔట్​ సోర్సింగ్​, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు సర్కార్​ అనుమతించింది. ప్రతి కలెక్టరేట్​తో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్​మెంట్లలోనూ, మండల కేంద్రంలో ఉండే ఎంపీడీవో, ఎమ్మార్వో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడ కూడా  పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. 

ఆఫీసర్ల పోస్టులతో పాటు జూనియర్​ అసిస్టెంట్లు, కంప్యూటర్​ ఆపరేటర్లు, రికార్డ్​ అసిస్టెంట్లు కొరత తీవ్రంగా వేధిస్తోంది. అయితే.. కొత్త జిల్లాలకు తగ్గట్టు జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్​ ఆర్డర్​ వచ్చాక కొత్తగా  శాంక్షన్డ్​ పోస్టులు మంజూరు చేస్తామని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వచ్చింది. ప్రస్తుతం కేడర్​ స్ట్రెంత్​ ఫైనలైజేషన్​లో మాత్రం కొత్త పోస్టుల మంజూరును ప్రస్తావించడం లేదు. పాత వారితోనే సర్దుబాటు చేసుకుంటూ పనులు చేసుకోవాలని జిల్లాలకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. 
3.48 లక్షల డైరెక్ట్​ కేడర్​ స్ట్రెంత్​
డైరెక్ట్​ రిక్రూట్మెంట్​లో ప్రభుత్వ విభాగాల్లో 2,95,571 శాంక్షన్డ్ కేడర్​ స్ట్రెంత్​ ఉండగా..  ఇన్​స్టిట్యూషన్లలో 52,988 స్ట్రెంత్​ ఉంది. మొత్తంగా 3,48,559 డైరెక్ట్​ క్యాడర్​స్ట్రెంత్​ ఉంది. మిగిలిన కేడర్​ కలిపితే మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల స్ట్రెంత్​ 4,43,094. ఇందులోనే రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని పీఆర్సీ తన రిపోర్ట్​లో వెల్లడించింది. అయితే ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కొన్ని నెలలుగా ఊరిస్తూ వస్తోంది. ఖాళీలు గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని చెబుతోంది. కానీ.. ఇంకా ఖాళీల గుర్తింపునే కొనసాగిస్తోంది. ఒకవేళ వాటిని గుర్తించి, భర్తీ చేసినా, కొత్తగా శాంక్షన్డ్​ పోస్టులు అవసరం అవుతాయని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లలో భారీగా ఖాళీలు ఉంటాయని కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు కొత్తగా పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. 
ప్రతి ఆఫీసులో ఖాళీలే
పాత జిల్లాలు, పాత మండలాల నుంచే ఉద్యోగులను సర్దుబాటు చేయడంతో కొత్త వాటితో పాటు పాత వాటిలోనూ తగిన సంఖ్యలో ఉద్యోగులు లేకుండాపోయారు. కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతి విభాగంలోనూ పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 592 మండలాలు ఉన్నాయి. ఒక్క మండలం కింద యావరేజ్​గా 20 గ్రామాలుంటాయి. ఎమ్మార్వో ఆఫీసులో మినిమమ్​ 20 మంది ఉద్యోగులు అవసరం. ఇందులో ఒక తహాసీల్దార్​, డిప్యూటీ తహసీల్దార్​, ఇద్దరు గిర్దావర్లు, ఇద్దరు సీనియర్​ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్​ అసిస్టెంట్లు, ఒక టైపిస్ట్​, ముగ్గురు కంప్యూటర్​ ఆపరేటర్లు, ఒక సర్వేయర్​, ఒక చైన్​మన్​, రికార్డు అసిస్టెంట్,​ ఇద్దరు అటెండర్లు, ఒక వాచ్​మన్​ ఉంటారు. అయితే ఇప్పుడు 80 శాతం మండలాల్లో పది, 12 మంది లోపే పనిచేస్తున్నారు. ఇక ప్రతి గ్రామానికి వీఆర్ఏ, వీఆర్వోలు ఉంటారు. ఇప్పుడు వీఆర్వో వ్యవస్థ తీసేయడంతో ఉన్న ఆ పది మందిపై అధిక పని భారం పడుతోంది. కళ్యాణ లక్ష్మితో పాటు క్యాస్ట్​, ఇన్​కం వంటి అనేక సర్టిఫికెట్లు ఎమ్మార్వో ఆఫీసు నుంచే ఇవ్వాల్సి ఉంటుంది. భూములకు సంబంధించి ఫీల్డ్​లెవెల్​లో ఏ సర్వే చేయాలన్నా, ఓటరు గుర్తింపు, ఎన్నికల నిర్వహణ వంటిది మొత్తం వీళ్లే చూసుకుంటారు. ఇక ఎంపీడీవో ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పనులు, ఆసరా పెన్షన్లు, ఇంజనీరింగ్ విభాగంలో​రోడ్లు, ఇతర నిర్మాణాలకు అంతా అక్కడి నుంచే జరుగుతోంది.