వడ్డీ రేట్లు మార్చని రిజర్వు బ్యాంక్.. హోమ్ లోన్, కార్ లోన్ EMIలు మారలే..!

వడ్డీ రేట్లు మార్చని రిజర్వు బ్యాంక్.. హోమ్ లోన్, కార్ లోన్ EMIలు మారలే..!

రిజర్వ్ బ్యాంక్ తాజా మానిటరీ పాలసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరోసారి నిరాశనే మిగిల్చింది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురుచూసిన రెపో రేటును ఈసారి కూడా 5.25 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీనివల్ల ఇళ్లు, కారు, వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మధ్యతరగతి జీవులకు EMI భారం నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. వడ్డీ రేట్లు తగ్గుతాయని, నెలవారీ చెల్లింపులు కొంచెమైనా తగ్గి రిలీఫ్ వస్తుందని భావించిన సామాన్యుడి ఆశలపై ఆర్‌బీఐ నిర్ణయం నీళ్లు చల్లింది.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్‌బీఐ.. దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.6 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో తలెత్తిన సుదీర్ఘ అంతరాయాలు, పెరిగిన ఇంధన ధరల ప్రతికూల ప్రభావం వృద్ధి రేటు మందగించడానికి, ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతోందని గవర్నర్ పేర్కొన్నారు. ఏప్రిల్ పాలసీ అంచనాలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు కొంత క్లిష్టంగా మారడం వల్లే వృద్ధి రేటు అంచనాలను తగ్గించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

దేశీయ సర్వీస్ సెక్టార్ మాత్రం స్థిరంగా కొనసాగుతోందని ఆర్‌బీఐ తెలిపింది. ఏఐ సాంకేతికత వల్ల ఉద్యోగాలు, సేవలపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు ఉన్నప్పటికీ.. ఈ రంగం ఇప్పటికీ బలంగానే నిలదొక్కుకుందని మల్హోత్రా స్పష్టం చేశారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ఆహార రంగం భవిష్యత్తుపై మాత్రం ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనంపై ఉన్న అంచనాల వల్ల ఆహార ఉత్పత్తుల ధరలు, లభ్యతపై స్పష్టత కొరవడిందని గవర్నర్ తెలిపారు. ఈ అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాల వల్లే వడ్డీ రేట్లను తగ్గించే సాహసం ఆర్‌బీఐ చేయలేకపోయింది. ఫలితంగా మార్కెట్లో ధరల నియంత్రణ కోసం ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం.. రుణాల భారం మోస్తున్న సామాన్య కుటుంబాలకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వలేదు.