జొన్నలకు మద్దతు ధర ఇస్తలె

జొన్నలకు మద్దతు ధర ఇస్తలె
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆదిలాబాద్ జిల్లా రైతు
  • సర్కారుకు బెంచ్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జొన్నల సాగు వివరాలు, పంట దిగుబడి, జొన్నల సేకరణలపై సమగ్ర వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జొన్న పంటకు రాష్ట్రంలో మద్దతు ధర లభించట్లేదని దాఖలైన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీష్‌‌చంద్రశర్మ, జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలి డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం విచారించింది. ఆదిలాబాద్‌‌ జిల్లా రైతు స్వరాజ్య వేదిక ప్రసిడెంట్‌‌ ఎస్‌‌.బొర్రన్న పిల్‌‌ దాఖలు చేశారు. జొన్నలకు మద్దతు ధర కల్పించాలన్న రైతుల వినతిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఆ వినతులను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్​ తరఫు లాయర్ కోరారు. 

కేంద్రం 2018–19లో క్వింటాల్​ జొన్నలకు రూ.2,430లను మద్దతు ధరగా ప్రకటించిందని, ఇటీవల ఆ ధరను రూ.2738గా నిర్ణయించిందని తెలిపారు. అయితే, రాష్ట్ర సర్కారు మాత్రం క్వింటాల్ జొన్నలను రూ.1,500 నుంచి రూ.1,700 మధ్య ధరకే కొనుగోళ్లు చేసిందని కోర్టుకు వివరించారు. వరి సాగు వద్దని రాష్ట్ర సర్కార్‌‌ చెప్పడం వల్లే జొన్నలు సాగు చేస్తే మద్దతు ధర లేకుండాపోయిందన్నారు. 2021–22లో ఆదిలాబాద్‌‌ జిల్లాలోనే 31,400 ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయని, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్‌‌ జిల్లాల్లో లక్ష ఎకరాలకు సాగు పెరిగిందన్నారు. ఈ మేరకు మార్కెటింగ్, అగ్రికల్చర్‌‌ శాఖల ప్రిన్సిపల్‌‌ సెక్రటరీలు, కమిషనర్లు, మార్క్‌‌ఫెడ్‌‌ ఎండీ, ఆదిలాబాద్‌‌ జిల్లా కలెక్టర్, జిల్లా అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.