ఉద్యోగులకు అద్దె​ అలవెన్సు​ పెంచలె

ఉద్యోగులకు అద్దె​ అలవెన్సు​ పెంచలె

క్యాతనపల్లి, నస్పూర్ లలో సింగరేణి ఉద్యోగులకు పెరగని హెచ్ఆర్ఏ

రామకృష్ణాపూర్​,వెలుగు: రెండేళ్ల కిందటే మున్సిపాలిటీలుగా మారినా వాటి పరిధిలోని  సింగరేణి ఉద్యోగులకు కొత్త హెచ్​ఆర్​ఏ అందడంలేదు. పాత మున్సిపాలిటీ ఏరియాల్లో ఇస్తున్నట్టు తమకు హెచ్ఆర్ఏ పెరుగుతుందన్న ఆశ నెరవేరలేదు. సింగరేణి పరిధిలోని క్యాతన్​పల్లి, నస్పూర్​ రెండేళ్ల కింద మున్సిపాలిటీలయ్యాయి. మున్సిపాలిటీల పరిధిలోని కార్మికులకు, ఉద్యోగులకు సింగరేణి 10శాతం హౌజ్​ రెంట్​ అలవెన్సు ఇవ్వాల్సిఉండగా.. క్యాతనపల్లి, నస్పూరులలో మాత్రం ఇంకా అలవెన్సు పెంచలేదు.  క్వార్టర్​సౌకర్యంలేని కార్మికులకు నెలకు రూ.150 మాత్రమే  హెచ్​ఆర్​ఏ కింద ఇస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో నివసించే బొగ్గు గనుల ఉద్యోగులకు, కార్మికులకు యాజమాన్యం క్వార్టర్​ సౌకర్యం ఇవ్వకుంటే 10 శాతంహెచ్​ఆర్​ఏగా చెల్లించాలని బొగ్గు గని కార్మికుల వేజ్​బోర్డు నిర్ణయించింది. గత ఏడాది నుంచి 8శాతం ఇస్తున్నారు. 2018 ఆగస్టు 1న కోల్​బెల్ట్​ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో  క్యాతన్​పల్లి, నస్పూర్ లను ప్రభుతకవం మున్సిపాలిటీలుగా చేసింది. అంతకు ముందు జిల్లాలోని సింగరేణి ఏరియాలో  మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ ఉంటున్న  సింగరేణి ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం 8శాతం హెచ్​ఆర్​ఏ అమలు చేస్తోంది. రెండేళ్లనుంచి తమకు 10 శాతం హెచ్​ఆర్​ఏ రావాల్సిఉండగా యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఈ పట్టణాలకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేజ్​బోర్డ్​ అగ్రిమెంట్​ ప్రకారం హెచ్​ఆర్​ఏ పెంచి ఇవ్వాలని కార్మిక సంఘాలు  పోరాడుతున్నాయి.

బొగ్గు గనులన్నీ మున్సిపాలిటీల పరిధిలోకి ….

ఆర్కే-1ఏ బొగ్గు గని, ఆర్కేపీ ఓపెన్​కాస్ట్​, సింగరేణి ఏరియా ఆసుపత్రి, ఆర్కేపీ సీహెచ్​పీ, రీజినల్​ అనాలటికల్​ ల్యాబ్​, సివిల్​, హెల్త్​ విభాగాలు,  ఆర్​అండ్ డీ డిస్పెన్సరీ, రాజీవ్​చౌక్​ డిస్పెన్సరీ క్యాతన్​పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి.  జైపూర్​ మండలం  ఇందారం- 1ఏ బొగ్గు గని మినహా మిగిలిన శ్రీరాంపూర్​ ఏరియాలోని ఏడు అండర్​ గ్రౌండ్​ మైన్స్​, ఒక ఓసీపీతో పాటు డిపార్ట్​మెంట్లు , ఆఫీసులన్నీ  నస్పూర్​ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. వీటిలో క్వార్టర్​ సౌకర్యంలేని 7వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.   మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగులకు బేసిక్ సాలరీ పై 8శాతం హెచ్​ఆర్​ఏ ఇవ్వాలి. సింగరేణిలో  రూ.26వేల నుంచి రూ.70వేల వరకు బేసిక్​ సాలరీ ఉంటుంది.  అంటే నెలకు ఒక్కో ఉద్యోగికి రూ.2080 నుంచి రూ.5,600 వరకు చెల్లించాలి. క్యాతన్​పల్లి, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో క్వార్టర్​ సౌకర్యం లేని  సుమారు 7వేలు మంది ఉద్యోగులకు హెచ్​ఆర్​ఏ అందడంలేదు. వీరితో పాటు  పాత మున్సిపాలిటీలైన చెన్నూరు, లక్షెట్టిపేట పరిధిలోని మైన్స్​లో పనిచేసే మరో 1500 మంది ఉద్యోగులకు కూడా పెంచిన హెచ్​ఆర్​ఏ అమలు కావడంలేదు.  8,500 మంది ఉద్యోగులు నెలకు సగటున రూ.3,500  చొప్పున రూ.2.97కోట్లు కోల్పోతున్నారు. ఈ లెక్కన ఉద్యోగులు రెండేళ్లలోరూ.71 కోట్లను నష్టపోయారు.

10 శాతం హెచ్​ఆర్​ఏ చెల్లించాలి

శ్రీరాంపూర్, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు 10 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్​ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్​ జీఎం ఆఫీస్​ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం దీక్షలను ఏఐటీయూసీ జనరల్​సెక్రెటరీ వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్​ప్రారంభించారు. మొదటి రోజు దీక్షలో ఎస్​ఆర్​పీ-1 కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు  బాజీసైదా,  ముస్కె సమ్మయ్య,  మేకల దాసు, కౌన్సిలర్​ రేగుంట చంద్రశేఖర్​, బ్రాంచి సెక్రెటరీ కొట్టె కిషన్​రావు, నాయకులు వేణుమాధవ్​, జోగుల మల్లయ్య, నర్సింగరావు, లింగం రవి, దాడి రాజయ్య, కారుపాక మొగిలి, వేణు  పాల్గొన్నారు.