
హైదరాబాద్/సికింద్రాబాద్ వెలుగు: అగ్నిపథ్ ఆందోళనలతో ధ్వంసమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ వేగవంతం చేసింది. వందలాది మంది పోలీసు పహారా నడుమ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. శనివారం ఉదయం వరకు నిర్మానుష్యంగా కనిపించిన స్టేషన్ మధ్యాహ్నానికి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అధికారులు శనివారం మబ్బుల నుంచే క్లీనింగ్ పనులు మొదలుపెట్టారు. కాలిపోయిన రైల్వే కోచ్‌ల నుంచి చెత్తను తొలగించారు. ప్లాట్ ఫామ్స్‌పై డ్యామేజ్ అయిన స్టాళ్లు, టీవీలు, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు, ఎస్కలేటర్లకు రిపేర్లు చేస్తున్నారు. డ్యామేజ్ అయిన బోగీలను లోకో షెడ్లకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు కోల్పోకుండా చూస్తున్నారు. అటువైపు ప్రయాణికులు వెళ్లకుండా ప్రత్యేక బారికేడ్లు ఉంచారు. పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించేందుకు ఆనవాళ్లను తొలగించట్లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అల్లర్లపై రైల్వే శాఖ శనివారం అంతర్గత సమీక్ష నిర్వహించింది. రైల్వే, జీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కేంద్రానికి నివేదిక అందజేశారు.
పవర్ కార్ పేలి ఉంటే..
శుక్రవారం జరిగిన ఆందోళనలో భారీ ప్రమాదం తప్పింది. రైలు బోగీలు కాలిపోయిన ప్రాంతానికి అత్యంత సమీపంలో పవర్‌కార్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో రైల్వే ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు. భారీ డీజిల్ ట్యాంకర్‌గా పిలుచుకునే పవర్ కార్‌కు ఏదైనా ప్రమాదం ఏర్పడితే భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉండేదని రైల్వే శాఖ చెబుతున్నది. అప్పటికే స్టేషన్లో మూణ్నాలుగు వేల మంది తిరుగుతుండగా.. పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. మూడో ప్లాట్ ఫామ్‌లో బోగీలు కాలుతుండగా.. దానికి దగ్గర్లోనే పవర్ కార్ ఉంది. 2 వేల లీటర్ల డీజిల్ నిల్వ చేసిన పవర్ కార్‌కు ప్రమాదం జరిగి ఉంటే.. పెద్దయెత్తున ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేది. రూ.100 కోట్లకు పైగా నష్టం జరిగేది.
5 కోచ్‌లు దగ్ధం.. 30 ఏసీ కోచ్‌లు డ్యామేజ్
స్టేషన్‌లో జరిగిన అల్లర్లతో మొత్తం రూ.12 కోట్ల మేర నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అభయ్ కుమార్ గుప్తా తెలిపారు. మొత్తం 5 కోచ్‌లు దగ్ధమయ్యాయని, 30 ఏసీ కోచ్‌లు, 47 నాన్ ఏసీ కోచ్‌లు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. ఎంఎంటీఎస్ రైలు పాక్షికంగా దెబ్బతినగా, పలు రైళ్ల విండో గ్లాసెస్ పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. నిరసనకారులు నిప్పు పెట్టడంతో 30 బైక్‌లు కాలిపోయాయి. ఫుడ్ స్టాళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, ఒక్కో స్టాల్‌లో రూ.3 లక్షల దాకా సామాన్లు పనికిరాకుండా పోయాయని స్టాల్‌లో పనిచేసే పథం తోమర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పని చేయని ఫైర్ సేఫ్టీ
రైళ్లు కాలిపోతున్న సమయంలో మంటల్ని ఆర్పే ఫైర్ సేఫ్టీ యంత్రాలు పనిచేయలేదని ప్రత్యక్ష సాక్షులు ‘వెలుగు’కు చెప్పారు. నిరసనకారులు ఈస్ట్ కోస్ట్ రైలుపై పెట్రోలును పోసి నిప్పంటించారు. బోగీలు కాలిపోతుండటంతో కొందరు ఫైర్ సేఫ్టే మిషిన్లను తీసుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా అవి ఓపెన్ కాలేదు. దీంతో వాటిని అక్కడే పడేసి సిబ్బంది అంతా బయటకు పరుగులు తీశారు.
భారీ భద్రత.. తనిఖీలు
రైల్వే అధికారులు సికింద్రాబాద్ స్టేషన్‌లో భారీ భద్రతను మోహరించారు. ప్రయాణికుల్ని అణువణువు తనిఖీ చేస్తున్నారు. ప్రయాణ టికెట్, ప్లాట్‌ఫామ్ టికెట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, టాస్క్ ఫోర్స్ బలగాలు స్టేషన్ చుట్టూ పహారా కాస్తున్నాయి.
రైళ్ల రద్దు.. రీషెడ్యూల్
రైళ్ల పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో శనివారం వివిధ మార్గాల్లో పలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. 50 రైళ్లను రద్దు చేయగా, వాటిలో 40 ఎంఎంటీఎస్‌లే ఉన్నాయి. శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరిన రైళ్లు తిరిగి రాకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి స్టేషన్‌కు వచ్చే బండ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. 10 రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.
80 శాతం పార్సిళ్లు బూడిద
రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిళ్లను సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్‌లోని ప్రత్యేక బోగీలోకి తరలించారు. దాడి ఘటనతో అందులోని పార్సిళ్లు 80 శాతానికి పైగా కాలి బూడిదయ్యాయి.
సుమోటోగా తీసుకున్న హెచ్‌ఆర్‌సీ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనను ఎస్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌గా తీసుకుంది. మీడియా కథనాల ఆధారంగా శనివారం సుమోటోగా కేసు స్వీకరించింది. జులై 20వ తేదీ లోగా సమగ్ర నివేదిక అందించాలని ఆర్పీఎఫ్ డైరెక్టర్, జీఆర్పీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.
లోకల్ పోలీసులే కాల్పులు జరిపారు: డీఆర్‌ఎం గుప్తా
దాడి ఘటనలో ఆందోళనకారులపై లోకల్ పోలీసులే ఫైర్ చేశారని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అభయ్ కుమార్ గుప్తా చెప్పారు. రైలు కోచ్‌లకు ఎక్కువగా డ్యామేజ్ జరిగిందని, ఆ తర్వాత ప్లాట్‌ఫామ్స్‌పై ఉండే స్టాల్స్, వాటర్ కూలర్స్ వంటి వస్తువులను చాలా వరకు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి సిగ్నలింగ్, ట్రాక్‌లు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు.