సీడబ్ల్యూసీలో రాష్ట్ర నేతలకు చోటు దక్కలే

సీడబ్ల్యూసీలో రాష్ట్ర నేతలకు చోటు దక్కలే
  • ఒక్కరికీ స్థానం కల్పించని కాంగ్రెస్ హైకమాండ్
  • కేవలం ఆహ్వానితులుగా ఇద్దరి నియామకం
  • శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర.. స్పెషల్ ఇన్వైటీగా వంశీచంద్ రెడ్డి
  • పార్టీ అంతంతమాత్రంగానే ఉన్న ఏపీ నుంచి ఒకరికి సీడబ్ల్యూసీలో చోటు
  • యాక్టివ్​గా లేని రఘువీరా రెడ్డికి చాన్స్.. ఆహ్వానితులుగా మరో ముగ్గురు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. అత్యున్నత కమిటీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)లో ఒక్క తెలంగాణ నేతకూ చోటు దక్కలేదు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రం నుంచి ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారని నేతలు భావించినా.. పార్టీ అధిష్ఠానం మొండిచెయ్యి చూపించింది. రెగ్యులర్ మెంబర్‌‌‌‌గా ఒక్కరినీ నియమించలేదు. 

కేవలం శాశ్వత ఆహ్వానితుడు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇద్దరిని నియమించి చేతులు దులుపుకుంది. అసలు పార్టీ ఉనికే లేని ఏపీ నుంచి ఒకరికి సభ్యుడిగా, మరో ముగ్గురికి ఆహ్వానితులుగా అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొందరు రాష్ట్ర నేతలు.. అధిష్ఠానం నిర్ణయంపై ఓపెన్​గానే పెదవి విరుస్తున్నారు. సీడబ్ల్యూసీలో సభ్యుడిగా కనీసం ఒకరికి అవకాశం ఇచ్చినా.. త్వరలో జరిగే ఎన్నికల కోసం క్యాడర్ ఉత్సాహంగా పనిచేసేదని అంటున్నారు.

రేసులో ఎందరో..

మొత్తం 84 మందితో సీడబ్ల్యూసీ జాబితాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం విడుదల చేశారు. అందులో శాశ్వత ఆహ్వానితుడిగా రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్ రెడ్డిలకు చోటు దక్కింది. అసలు ఎవరూ ఊహించని పేర్లను అధిష్ఠానం ప్రకటించే సరికి పలువురు నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ రేసులో ఉన్నారంటూ మొన్నటిదాకా సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సీతక్క, సంపత్​ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. జానారెడ్డికి ఈసారి కమిటీలో చోటు లభించవచ్చని చర్చ జరిగింది. 

గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికీ వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జోరుగా సాగింది. అయితే సామాజిక సమీకరణాలు, మహిళా నేత కూడా కావడంతో సీతక్కకు ఈసారి సీడబ్ల్యూసీలో చాన్స్‌‌ ఉండొచ్చని టాక్ వినిపించింది. వాస్తవానికి రేవంత్‌‌కు సీతక్క, సంపత్ కుమార్ సన్నిహితులు కావడంతో వారి పేర్లను అధిష్ఠానం పెద్దలకు సిఫార్సు చేశారన్న ఊహాగానాలు పార్టీ వర్గాల్లో జోరుగా వినిపించాయి. రాహుల్‌‌తోనూ సీతక్కకు మంచి అనుబంధం ఉండటంతో ఆమెకు సభ్యురాలిగా అవకాశం దక్కొచ్చనే చర్చ గట్టిగానే జరిగింది.

రాజకీయాల్లో యాక్టివ్‌‌గా లేని రఘువీరా రెడ్డికా?

పార్టీ నేతల అంచనాలను పటాపంచలు చేస్తూ అధిష్ఠానం పెద్ద షాకే ఇచ్చింది. సభ్యులుగా ఎవరికీ అవకాశం ఇవ్వకపోగా.. సీడబ్ల్యూసీ రేసులోనే లేని వంశీచంద్​ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం పార్టీలోని కొందరు నేతలకు మింగుడుపడటం లేదు. మరోవైపు పార్టీ అంతంతమాత్రంగానే ఉన్న ఏపీలో ఒకరికి అవకాశం ఇవ్వడం.. ఎన్నికలు జరిగే రాష్ట్రానికి చాన్స్ ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో అంత యాక్టివ్‌‌గా కూడా లేని రఘువీరా రెడ్డికి ఏపీ నుంచి సభ్యుడిగా అవకాశం కల్పించడం చర్చకు దారి తీసింది. రాజకీయాలు తనవల్ల కాదంటూ గతంలో ప్రకటన చేసిన ఆయన.. సామాజిక సేవ, కుటుంబానికే ఎక్కువ టైంను ఇస్తున్నారు. 

అలాంటి వ్యక్తికి సీడబ్ల్యూసీ సభ్యుడిగా చాన్స్ ఇచ్చి.. మన రాష్ట్రానికి ఇవ్వకపోవడం ఏంటని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు టి.సుబ్బరామిరెడ్డికి తెలంగాణలో ఓటు హక్కు ఉన్నందున ఆయనకు మన రాష్ట్ర కోటా కిందనే పర్మినెంట్ ఇన్వైటీగా చోటు దక్కిందన్న వాదన వినిపిస్తున్నది. అయితే ఆయన ఏపీ రాజకీయాల్లోనే ఉన్నందున అక్కడి నేతగానే మనోళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏపీకే చెందిన మరో సీనియర్ నేత కొప్పుల రాజుకు పర్మినెంట్ ఇన్వైటీగా, పల్లం రాజుకు స్పెషల్ ఇన్వైటీగా చోటు దక్కింది.

2009 తర్వాత మనోళ్లు ఒక్కరూ లేరు

సీడబ్ల్యూసీలో సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి 14 ఏండ్లుగా ఎవరికీ అవకాశం దక్కడం లేదు. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో తెలంగాణ నుంచి ఎంపీ కె.కేశవరావుకు కమిటీలో సభ్యుడిగా చోటు లభించింది. కేకే కన్నా ముందు ఉమ్మడి ఏపీలో మాజీ ముఖ్యమంత్రులైన కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామికి మాత్రమే సీడబ్ల్యూసీలో చోటు దక్కడం గమనార్హం. 1977 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో కేవలం ఈ నలుగురికే సీడబ్ల్యూసీ మెంబర్లుగా అవకాశం దక్కింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పలుమార్లు సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ జరిగినా.. తెలంగాణ నేతలకు చాన్స్ రాలేదు.

ఖర్గే, సోనియాకు థ్యాంక్స్​

కాంగ్రెస్​ పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీలో అవకాశం వచ్చిన వారికి పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సీడబ్ల్యూసీలో తెలంగాణ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డిలకు అవకాశం ఇచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  సోనియా గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీడబ్ల్యూసీలో అవకాశం వచ్చిన దామోదర రాజనర్సింహ, వంశీచంద్​ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.