కల్తీ మద్యం కాదు.. ప్లాన్డ్​ మర్డర్​

కల్తీ మద్యం కాదు.. ప్లాన్డ్​ మర్డర్​
  •  చంద్రు తండాలో  ముగ్గురి మృతిపై అనుమానాలు
  •  క్వార్టర్ ​బాటిల్​లో   మందు కలిపి హత్య?
  •  20 ఏళ్ల నుంచి ఉన్న  భూవివాదాలే కారణం 

ఖమ్మం/నేలకొండపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో మద్యం తాగి ముగ్గురు చనిపోయిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము తాగింది కల్తీ మద్యం కాదని, ప్లాన్ ​ప్రకారమే తమను హత్య చేయాలని చూశారని హాస్పిటల్​లో ఉన్న మరో ముగ్గురు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ముల కుటుంబసభ్యుల మధ్య కొన్నేళ్ల నుంచి ఉన్న భూమి గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో గొడవలతోనే ఈ ముగ్గురి హత్య జరిగినట్టు సమాచారం. చంద్రుతండాకు చెందిన బోడ భిక్షం కుమారుడు అర్జున్(58) ఇటీవల అనారోగ్యంతో చనిపోగా ఆయన దశదిన కర్మ శనివారం నిర్వహించారు. దీనికి హాజరైన బోడ హరిదాసు (60), బోడ మల్సూరు(57), బోడ భద్రు (30) అక్కడ మద్యం తాగి చనిపోయారు. మరో ముగ్గురు బోడ శంకర్, సైదులు, సుక్యా మద్యం ఎక్కువగా తాగకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం తాగిన ఆరుగురు, అర్జున్, అతని సోదరుడు బోడ చిన్నా అన్నదమ్ముల పిల్లలు. వీళ్లందరికీ వారసత్వంగా వస్తున్న ఎకరం భూమి విషయంలో 20 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం బోడ అర్జున్​ను మిగిలిన ఆరుగురు బాబాయ్ లు కలిసి పొలం దగ్గరే కొట్టారు. అప్పట్లో వీళ్లంతా కేసుల వరకు వెళ్లారు. కొన్నేళ్ల క్రితం కోర్టులో సైతం విచారణ జరగ్గా, ఇటీవల వీళ్లందరి మధ్య రాజీ కుదిరింది. అనారోగ్యం కారణంగా రెండు వారాల క్రితం అన్న అర్జున్​చనిపోగా, బోడ చిన్నా తనను మిగిలిన ఆరుగురు టార్గెట్ చేస్తారనే భయంతో వాళ్లను చంపేందుకు ప్లాన్​ చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. 
పోలీసుల అదుపులో చిన్నా 
బోడ చిన్నా గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తుండేవాడు. అన్నదమ్ముల కుటుంబసభ్యుల మధ్య గత వివాదాలన్నీ రాజీ అయినప్పటికీ, అన్నను గతంలో ఒంటరిగా పట్టుకొని పొలం దగ్గర కొట్టిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నా ఈ హత్య స్కెచ్​ వేసినట్టు అనుమానిస్తున్నారు. ఇతర బంధువులతో పాటు ఆరుగురిని కర్మకాండలకు పిలిచిన చిన్నా, రాత్రి వాళ్లు భోజనం చేస్తున్న సమయంలో మద్యం తెచ్చానంటూ మధ్యలోనే పక్కకు తీసుకెళ్లాడు. అప్పటికే తెచ్చి పెట్టిన రెండు మద్యం క్వార్టర్​ బాటిల్స్​ఇచ్చాడు. ఆర్ఎంపీగా చేసిన అనుభవంతో అందులో ఏదో ఒక ట్యాబ్లెట్ కానీ, ఇంజక్షన్​ గానీ కలిపాడని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు చెబుతున్నారు. శనివారం సాయంత్రం నుంచి చిన్నా కుటుంబసభ్యులు పరారీలో ఉండడం, ఇంటికి తాళం వేసి ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఇప్పటికే బోడ చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్​లో అయితే అక్కడ రెండు కుటుంబాలకు చెందినవారితో గొడవలు జరుగుతాయనే అనుమానంతో శనివారం రాత్రి చిన్నాను ఖమ్మం రూరల్​పోలీస్​స్టేషన్​కు తరలించారు. అక్కడే ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు హత్యకు గల కారణాలపై ప్రశ్నిస్తున్నామని, పూర్తి వివరాలు తమకు క్లారిటీ వచ్చిన తర్వాతే చెబుతామని పోలీసులు అంటున్నారు.
గ్రామంలో ఉద్రిక్తత
చనిపోయిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం తర్వాత ఆదివారం చంద్రు తండాకు తరలించారు. ముగ్గురి మృతికి చిన్నా కుటుంబమే కారణమంటూ మృతదేహాలను అతడి ఇంటి ముందు ఉంచి బంధువులు ఆందోళనకు దిగారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు సర్దిచెప్పడంతో మృతదేహాలను అంత్యక్రియలకు తరలించారు.