క్రాప్ లోన్లు సగం కూడా ఇయ్యలే

క్రాప్ లోన్లు సగం కూడా ఇయ్యలే

కనీసం 25 శాతం మంది రైతులకు కూడా అందలే

సర్కార్ ఆదేశాలను పట్టించుకోని బ్యాంకర్లు

వానాకాలం టార్గెట్ రూ.31,933 కోట్లు

ఇప్పటివరకు ఇచ్చింది రూ.13,850 కోట్లే

మరో నెల రోజుల్లో ముగియనున్న సీజన్

60 లక్షల రైతుల్లో 13.50 లక్షల మందికే లోన్లు

బ్యాంకులపై ఒత్తిడి తీసుకురాని సర్కార్

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వాలు ఎంత చెప్పినా రైతులకు క్రాప్ లోన్లు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తున్నాయి. స్టేట్‌ లెవల్‌‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి రైతులకు లోన్లు ఇవ్వాలని ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ టార్గె ట్‌ లు పెట్టినా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఏటా రైతులకు రుణాలు ఇవ్వడానికి అంతగా ముందుకు రాని బ్యాంకులు.. ఈ ఏడు మరింతగా నిర్లక్ష్యం చూపాయి. ఈసారి కనీసం పావు  వంతు మంది రైతులకు కూడా బ్యాంకులు లోన్లు ఇవ్వలేదు.

టార్గెట్‌ లో సగం కూడా ఇయ్యలే..

ఈ ఏడాది మొత్తంగా రూ. 53,222 కోట్ల క్రాప్ లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాం కర్లకు టార్గె ట్‌ విధించింది. మొత్తం పంట రుణాల్లో 60 శాతం వానాకాలంలో (రూ.31,933.20 కోట్లు) ఇవ్వాలని నిర్ణయించింది. సీజన్‌‌ ఇంకో నెల రోజుల్లో పూర్తి కానుం ది. కానీ ఇప్పటి వరకు రైతులకు రూ.13,850 కోట్ల క్రాప్ లోన్లు మాత్రమే బ్యాంకర్లు ఇచ్చిన్రు. అంటే టార్గెట్‌ లో కనీసం సగం కూడా ఇవ్వలేదని స్పష్టమవుతోం ది.

13.50 లక్షల మందికే ఇచ్చిన్రు..

రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ లో 60 లక్షలకు పైగా రైతులు 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వీరిలో కనీసం పావు వంతు మంది రైతులకు కూడా బ్యాం కులు రుణాలు ఇవ్వలేదు. సీజన్‌‌ ముగిసే దశకు వచ్చినా.. ఇప్పటి వరకు 13.50 లక్షల మందికే లోన్లు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చిన్న రైతులకు పెట్టుబడి కష్టా లు..

ఎకరం వరి నాటు వేయాలంటే రూ.20 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. ఎకరం, రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి సాయం ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మిర్చిపంట కొనేవారు లేక ధర రావాలని కోల్డ్‌‌ స్టోరేజీలో పెట్టుకున్నామని రైతులు చెప్తున్నారు. దీనికి తోడు రుణమాఫీ కూడా ఐదు లక్షల మందికే అందింది. మరోవైపు కరోనా సాకుతో కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడ్తున్నరు.

బ్యాంకులపై ఒత్తిడి ఏదీ?

రైతులకు క్రాప్ లోన్లు ఇచ్చి పంటల సాగుకు సహకరించాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించాల్సి ఉంది. కానీ వ్యవసాయ మంత్రి నిరంజన్‌‌ రెడ్డి దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తూ.. రైతులకు మాత్రం లోన్లు అవసరం లేనట్లు, అప్పుల పాలు కావద్దన్నట్లుగా మంత్రి మాట్లాడుతున్నారని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రాప్ లోన్ల విషయంలో బ్యాంకులపై ఒత్తిడి పెంచాల్సింది పోయి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు సకాలంలో క్రాప్ లోన్లు అందేలా చూడాలని కోరుతున్నారు.