- ఇటీవలి మున్సిపల్ ఓటర్ల లిస్టుల్లో 3 నుంచి 5 శాతం చనిపోయిన వాళ్లే...
- కొందరికి ఒకే చోట రెండు ఓట్లు
- మరికొందరికి రెండు చోట్లా ఓటు హక్కు
- ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం
హైదరాబాద్, వెలుగు : రెండు రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల సాక్షిగా ఆఫీసర్ల నిర్లక్ష్యం బయటపడింది. ఏ వార్డులో, డివిజన్ఓటర్ల లిస్టు చూసినా వందల సంఖ్యలో చనిపోయినవాళ్ల పేర్లు దర్శనమిచ్చారు. చనిపోయినవాళ్ల ఓటర్ స్లిప్పులను పంచుతుంటే ఆయా కుటుంబసభ్యులు బిత్తరపోయారు.
రాష్ట్రంలో చనిపోయిన వారు, డబుల్ ఓట్లు కలిపి మొత్తం నాలుగు లక్షల ఓట్లను తొలగించామని ఇటీవల ఈసీ గొప్పగా ప్రకటించినా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 52 లక్షలకు పైగా ఓట్లు ఉంటే ఇందులో మూడు నుంచి ఐదు శాతం ఓట్లు చనిపోయిన వారివే ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఇవే కాకుండా.. ఒక వ్యక్తికి ఒకే చోట రెండు ఓట్లు ఉండడం, మరికొందరికి గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఓటరుగా నమోదు కావడం కనిపించింది. ఇటీవల విడుదల చేసిన ఓటర్ లిస్ట్ ప్రకారం రాష్ట్రంలో 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చనిపోయినవారివి, డబుల్ ఓట్లు ఉన్న వారివే సుమారు 30 లక్షలకుపైగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డేటా అప్‌డేట్ చేస్తలే...
వాస్తవానికి 2025 జనవరి నుంచి 2026 జనవరి మధ్య రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఓటర్ల ప్రక్షాళన జరిగిందని అధికారులు చెబుతున్నారు. సుమారు 1.2 లక్షల నుంచి 1.5 లక్షల వరకు మరణించిన ఓటర్ల పేర్లను లిస్ట్‌ల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. అలాగే డూప్లికేట్లు, వలస వెళ్లిన వారు, మరణించిన వారు కలిపి గతేడాది కాలంలో సుమారు 4.85 లక్షల ఓట్లు తొలగించినట్లు వెల్లడించారు.
కానీ ఇంకా లక్షలాది బోగస్ ఓట్లు, మృతుల పేర్లు జాబితాల్లో కనిపిస్తున్నాయి. అవి కూడా ఏడాది, రెండేండ్ల కింద చనిపోయిన వారివి కావడం గమనార్హం. వీటితోపాటు మిగిలిన తప్పులను సరిదిద్దడంలోనూ అధికారులు విఫలమయ్యారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో సరైన విధానాలు పాటించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా 85 ఏండ్లు పైబడిన వారు, దీర్ఘకాలంగా ఓటు వేయని వారి వివరాలను ఇంటింటికీ వెళ్లి వెరిఫై చేసి మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా వారి ఓటును తొలగించాలి. మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల నుంచి వచ్చే మరణాల డేటాను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
కానీ జనన, మరణాల రిజిస్ట్రార్ ఆఫీస్‌కు, ఎన్నికల సంఘానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోంది. మరణించిన వ్యక్తి వివరాలు మున్సిపాలిటీ రికార్డుల్లో నమోదవుతున్నా, ఆ పేరు ఓటరు లిస్ట్ నుంచి ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పేరుకే ఈఆర్‌వో నెట్.. డూబ్లికేట్‌కు పడని చెక్
టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత పరిస్థితిలో కూడా ఓటరు లిస్ట్‌లో దొర్లుతున్న తప్పులు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ‘ఈఆర్‌వో నెట్ ’ విధానాన్ని తీసుకొచ్చినా.. అది ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పేరు, ఇతర వివరాలు ఒకే విధంగా ఈఆర్‌వో నెట్‌లో తెలిసిపోతుంది. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓటును డిలీట్ చేయాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు. ఫలితంగా ఒకే వ్యక్తికి ఒకే చోట రెండ్లు ఓట్లు ఉంటుండగా, మరికొందరికి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంటోంది.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
- కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో సుమారు 250 మంది వరకు చనిపోయిన వారి ఓట్లు జాబితాలో కనిపించాయి. డివిజన్ పరిధిలోని చిందం రాజేశం, చిందం మల్లేశం, సిల్ల శివరాజ, చిల్ల రవి, ఉత్తం ప్రభాకర్, చిల్ల సారమ్మ, చిల్ల భూమయ్య, చిందం సాయికిరణ్,
- చిందం మల్లయ్య, చిందం చిలుకమ్మ, గోపాల పాండు, చిల్ల లక్ష్మయ్య మరణించి చాలా కాలమైనా వారి పేర్లను ఓటర్ లిస్ట్‌ను తొలగించలేదు.
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలోనూ మృతుల ఓట్ల జాబితా అలాగే ఉంది. ఇక్కడి 9వ వార్డులో ఆరెల్లి పద్మ, ఐత పోచమ్మ, సింగరబోయిన ఆగయ్య, సింగరబోయిన ఐలయ్య, అలుగునూరి యాకమ్మ, పసునూరి వెంకటేశ్వర్లు, గొల్లపల్లి మోహన్, రామగిరి కృష్ణమూర్తి, దుబ్బాక మధుసూదన్, ఆవుల కొమురయ్య వంటి వారు మరణించినప్పటికీ ఓటర్లుగానే కొనసాగుతున్నారు. అలాగే 1వ వార్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో సుమారు 170 మంది చనిపోయిన ఓటర్లు ఉండడం గమనార్హం. ఒక్క 4వ వార్డులోనే దాదాపు 30 మంది మృతుల పేర్లు లిస్ట్‌లో దర్శనమిస్తున్నాయి.
- జగిత్యాల జిల్లా కోరుట్ల లోని 31 వ వార్డు లో దాదాపు 30 మంది వరకు చనిపోయిన వారి పేర్లు దర్శనమిచ్చాయి. అలాగే కోరుట్ల లో 33 వార్డుల్లో ప్రతి వార్డులో దాదాపు 10 నుంచి 20 మంది వరకు చనిపోయిన వారి పేర్లు జాబితా లో ఉన్నట్లు అభ్యర్థులు వెల్లడించారు.
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డుకు చెందిన ఓ మహిళ పేరు రెండు సార్లు నమోదైంది.
- ములుగు మున్సిపాలిటీలోని 9వ వార్డులో చదువు భాస్కర్ రెడ్డి, యార రవీందర్, యార నాగరాజు, బానోతు బామిని, రుద్రోజు నర్సమ్మ తదితర 20 దాకా డబుల్ ఓట్లు ఉన్నాయి. 7వ వార్డులోనూ 10డబుల్ ఓట్లు వచ్చాయి.
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ 9వ వార్డులో ఆరెల్లి పద్మ , ఐత పోచమ్మ , సింగర బోయిన ఆగయ్య, సింగరబోయిన ఐలయ్య, అలుగునూరి యాకమ్మ , పసునూరి వెంకటేశ్వర్లు, గొల్లపల్లి మోహన్, రామగిరి కృష్ణమూర్తి, దుబ్బాక మధుసూదన్, ఆవుల కొమురయ్య తదితరులు చనిపోయినా తాజాగా జరిగిన మున్సిపల్ఓటర్ లిస్టులో పేర్లు దర్శనమిచ్చాయి.
