మాదాపూర్, వెలుగు: బహుళ అంతస్తుల భవనాల యజమానులు, వినియోగదారులు కచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, అగ్నిమాపక శాఖ నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ పొందాలని రంగారెడ్డి జిల్లా-1 అగ్నిమాపక అధికారి షేక్ ఖాజా కరీముల్లా సూచించారు. ప్రజా పాలన 99 రోజుల విజయోత్సవాల్లో భాగంగా బుధవారం మాదాపూర్‌లోని గ్లేసియర్ బిల్డింగ్, ఎస్బీఆర్ గేట్‌వే కాంప్లెక్స్‌లలో అగ్నిమాపక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు భవనాలు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోలేదని, సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనపై బిల్డింగ్ యజమానులకు ఫాం-12 కింద నోటీసులు జారీ చేసినట్లు కరీముల్లా తెలిపారు.
