- ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ల ఆధారంగా
- ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు
- బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు నిందితుల వెల్లడి
- నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న సజ్జనార్ టీమ్
- ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ
హైదరాబాద్, వెలుగు: ఫోన్‌ట్యాపింగ్ కేసులో మరో సంచలనానికి సిట్ సిద్ధమైంది. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్(ఎస్‌వోటీ) చీఫ్ ప్రణీత్‌రావు, సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హారీశ్‌రావును విచారించేందుకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని నిందితులు వెల్లడించడం, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్వల్ల అంతిమ ప్రయోజనం మాజీ సీఎం కేసీఆర్‌కే ఉండడం, సిద్దిపేట కేంద్రంగా జరిగిన ట్యాపింగ్‌లో హరీశ్‌రావు పాత్ర ఉందని తేలడంతో వీరిద్దరికీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇక ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ఈ నెల 26న ముగియనుంది.
‘సుప్రీం రావు’ చెప్పినట్టే ఆపరేషన్లు..
‘టీఆర్‌ఎస్ సుప్రీం’ సూచనల మేరకు 2017లో రాధాకిషన్ రావును సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నియమించారు. ప్రధానంగా ఇతర పొలిటికల్ పార్టీలను తమ అధీనంలోకి తీసుకురావడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఆర్థిక వనరులను దెబ్బతీసే విధంగా ‘సుప్రీం’ నుంచి ఆదేశాలు వచ్చేవి. ఇందులో భాగంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన ఆపరేషన్లను రూపొందించారు. ఇందుకోసం ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ప్రణీత్‌రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న కలిసి ‘ఆపరేషన్ టార్గెట్స్’లో భాగంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు.
ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్‌వేర్, టూల్స్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇందుకుగాను అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా రూ. కోట్లు చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది సేకరించిన ఫోన్ నంబర్లు, ట్యాపింగ్ ఆధారంగా టీఆర్‌ఎస్ సుప్రీం సూచించిన వారిని టార్గెట్ చేసి రెయిడ్స్ చేసేవారు. డబ్బు తీసుకోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం, అక్రమ కేసులు బనాయించడం చేసేవారని కోర్టుకు సిట్ ఆధారాలు అందజేసింది.
ప్రభాకర్ రావుకు ‘సుప్రీం’ అండదండలు..
‘సుప్రీం’ రావు ఆదేశాల మేరకు ప్రతి ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులే గెలిచే విధంగా ఇతర పార్టీలను కట్టడి చేశారు. ఇందుకోసం రాధాకిషన్‌రావును రిటైర్మెంట్ తరువాత కూడా 2020 ఆగస్ట్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా మరో మూడేండ్లు(2023 ఆగస్ట్) టాస్క్‌ఫోర్స్ డీసీపీ కంటిన్యూ చేశారు. ఈ మేరకు ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు.
ఇలా ఎస్‌ఐబీ ఎస్‌ఓటీ ప్రణీత్‌రావు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా రాధాకిషన్ రావు టీమ్ హైదరాబాద్‌లో సెర్చ్ చేసేది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పక్కా సమాచారంతో ప్రత్యర్థుల ఇళ్లలో సోదాలు, అనుచరులను గుర్తించి కోట్ల రూపాయలు సీజ్ చేసింది. ఈ సమాచారం అంతా ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు నుంచి సిట్ రాబట్టింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు కీలక వివరాలు రాబడుతున్నారు.
‘బాస్’.. ‘సుప్రీం’ ఆదేశాల మేరకే..
ప్రణీత్‌రావు సహా మిగతా ముగ్గురు నిందితులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెప్తుండగా.. తప్పించుకునే అవకాశాలు లేకపోవడంతో ‘బాస్, సీనియర్ ఆఫీసర్లు, డీజీల’కు అన్నీ తెలుసునని ప్రభాకర్ రావు సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్ హయాంలో 2017 నవంబరు 17 నుంచి 2022 డిసెంబరు 31 వరకు మహేందర్‌రెడ్డి డీజీపీగా పనిచేశారు. అప్పటికే 2016 నుంచి ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీగా పని చేస్తున్నారు. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ నేపథ్యంలో 2022 డిసెంబర్ 28న అంజనీకుమార్‌ను గత సర్కార్ డీజీపీగా నియమించింది. వీరిద్దరి హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌లో ప్రభాకర్‌రావు తన మార్క్ చూపారు.
బీఆర్‌ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు, కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ నంబర్లను సహా దాదాపు 4,200 ఫోన్లను ట్యాపింగ్ లిస్టులో పెట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ మొదలుకుని, 2020లో జరిగిన దుబ్బాక, 2022 అక్టోబర్‌లో జరిగిన మునుగోడు బై ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇదంతా అప్పటి డీజీపీలకు తెలుసునని ప్రభాకర్ రావు సిట్‌కు వివరించారు. ఈ మేరకు మాజీ డీజీపీలు మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్ స్టేట్‌మెంట్లను రికార్డు చేసేందుకు సిట్‌అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా వారి వద్దకే వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు ‘బాస్’ను, రాధాకిషన్ రావు ‘సుప్రీం’ను విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది.
స్టేట్ మెంట్లు, నోట్ ఫైల్ ఆధారంగా విచారణ
ప్రభాకర్ రావు సిట్ విచారణలో వెల్లడించిన అంశాలతో పాటు ఆయన నియామకంపై సేకరించిన నోట్‌ఫైల్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావును ఎస్‌ఐబీ చీఫ్(ఓఎస్డీ)గా నియామకం, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం తెలియదని మాజీ సీఎస్‌లు సోమేశ్ కుమార్, శాంతికుమారి సహా ఇతర అధికారులు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిసింది.
మరోవైపు కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావును నియమించినట్లు సిట్‌కు వెల్లడించినట్లు సమాచారం. దీంతో పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావును ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించడంతో ఎస్‌వోటీ ఏర్పాటు, రాధాకిషన్ రావును ఓఎస్డీగా నియమించడానికి గల కారణాలను కేసీఆర్ నుంచి రాబట్టేందుకు విచారించనున్నట్లు తెలిసింది.
