ఇకపై రైళ్లలో రూ.50లకే అదిరిపోయే భోజనం

ఇకపై రైళ్లలో రూ.50లకే అదిరిపోయే భోజనం

జనరల్‌‌ బోగీల ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన  దక్షిణ మధ్య రైల్వే 
తొలుత 4 స్టేషన్లలో అమలు


సికింద్రాబాద్, వెలుగు: జనరల్‌‌ బోగీల ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే అతి తక్కువ ధరకే భోజన సదుపాయాన్ని కల్పించింది. ‘‘ఎకానమీ మీల్స్‌‌”పేరుతో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని ప్యాసింజర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎకానమీ భోజనం రూ.20 కాగా, కాంబో భోజనం రూ.50కే అందించనుంది. మొదటగా హైదరాబాద్‌‌, విజయవాడ, రేణిగుంట, గుంతకల్‌‌ స్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ నాలుగు రైల్వే స్టేషన్లలో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఆయా ప్రాంతాల వారి మెనూ ఆధారంగా ఫుడ్‌‌ను అందిస్తున్నారు. ఈ భోజన సదుపాయాన్ని ఇండియన్ రైల్వే టూరిజం క్యాటరింగ్ సర్వీస్ రిఫ్రెష్‌‌మెంట్ రూమ్‌‌ కిచెన్ యూనిట్లు, జన్ ఆహార్‌‌ సర్వీస్ కౌంటర్ల ద్వారా అందించనున్నారు. జనరల్ కోచ్‌‌లకు సమీపంలో ప్లాట్‌‌ఫారమ్‌‌పై ఈ సర్వీస్ కౌంటర్లు ఉంటాయి. ఎకానమీ భోజన సదుపాయం సాధారణ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని తక్కువ ధరలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో నాలుగు స్టేషన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఐఆర్‌‌‌‌సీటీసీ కిచెన్ ద్వారా భోజన సదుపాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే రెస్పాన్స్‌‌ ఆధారంగా మిగతా స్టేషన్లలో ఈ సదుపాయాన్ని విస్తరిస్తామని వెల్లడించారు.