NPDCL లో ఇండోర్‍ సబ్‍ స్టేషన్లు... 17 జిల్లాల్లో సబ్‍ స్టేషన్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ

NPDCL లో  ఇండోర్‍ సబ్‍ స్టేషన్లు... 17 జిల్లాల్లో సబ్‍ స్టేషన్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ

పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, పట్టణాల్లో భూముల కొరత నేపథ్యంలో టీజీఎన్‌‌పీడీసీఎల్‌‌ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. తక్కువ స్థలంలోనే అధిక సామర్థ్యంతో విద్యుత్ సేవలు అందించే ఇండోర్‌‌ సబ్‌‌స్టేషన్ల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న సబ్‌‌స్టేషన్లలో భారీ సామర్థ్యమున్న పవర్‌‌ ట్రాన్స్‌‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో భారీగా నిర్మాణ ఖర్చు తగ్గడమే కాకుండా విద్యుత్ అంతరాయాలు నివారించి వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది.

  • నిర్మాణ వ్యయం తక్కువ.. సామర్థ్యం ఎక్కువ
  •     తక్కువ స్థలంలో హై కెపాసిటీ ట్రాన్స్​ఫార్మర్లతో నిర్మాణం
  •     ఇప్పటికే 6 చోట్ల నిర్మాణ పనులు స్టార్ట్
  •     కోట్లలో ఖర్చు ఆదా అవుతుందంటున్న​అధికారులు

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలోని 17 జిల్లాల్లో విద్యుత్ సేవలు అందిస్తున్న టీజీఎన్‌‌పీడీసీఎల్‌‌ ఇకపై ఇండోర్ సబ్‌‌స్టేషన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. తక్కువ స్థలంలోనే అధిక విద్యుత్ సామర్థ్యంతో సేవలు అందించడంతో పాటు నిర్మాణ వ్యయాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న సబ్‌‌స్టేషన్ ప్రాంగణాల్లోనే అధిక సామర్థ్యమున్న ఎంవీఏ పవర్ ట్రాన్స్‌‌ఫార్మర్లు ఏర్పాటు చేసి ఓవర్‌‌లోడ్‌‌, విద్యుత్ అంతరాయాల సమస్యలను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 17 జిల్లాల పరిధిలో కొత్త కాలనీలు, ఇళ్లు, కమర్షియల్ సముదాయాలు పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది.

దీంతో కొత్త సబ్‌‌స్టేషన్లు అవసరమవుతున్నా పట్టణాల్లో స్థలాల కొరత వేధిస్తోంది. సాధారణంగా ఒక సబ్‌‌స్టేషన్‌‌కు అర ఎకరం లేదా సుమారు 2 వేల గజాల స్థలం అవసరం అవుతుంది. వరంగల్ వంటి నగరాల్లో గజం ధర రూ.25 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండటంతో ఒక్కో సబ్‌‌స్టేషన్ స్థలానికే రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఖర్చవుతోంది. అయినా అవసరమైన ప్రాంతాల్లో స్థలాలు దొరకడం లేదు.

300 గజాల్లోనే ఇండోర్ సబ్‌‌స్టేషన్..

స్థలాల కొరతను అధిగమించేందుకు టీజీఎన్‌‌పీడీసీఎల్‌‌ ఇండోర్ సబ్‌‌స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కొత్త టెక్నాలజీతో నిర్మించే ఈ సబ్‌‌స్టేషన్లకు కేవలం 300 గజాల స్థలం సరిపోతుంది. ఓపెన్ సబ్‌‌స్టేషన్లతో పోలిస్తే వర్షాలు, గాలిదుమారాల ప్రభావం తక్కువగా ఉండటంతో విద్యుత్ అంతరాయాలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్, హనుమకొండలోని గాంధీనగర్‌‌తో పాటు కరీంనగర్‌‌, ఖమ్మం, నిజామాబాద్‌‌, కామారెడ్డి జిల్లాల్లో ఇండోర్ సబ్‌‌స్టేషన్ల నిర్మాణం కొనసాగుతోంది.

తొలిసారిగా 16 ఎంవీఏ ట్రాన్స్‌‌ఫార్మర్లు..

వినియోగదారుల సంఖ్య పెరగడం, వేసవిలో విద్యుత్ వినియోగం అధికమవుతుండటంతో ఇప్పటికే ఉన్న సబ్‌‌స్టేషన్లలో అధిక సామర్థ్యమున్న పవర్ ట్రాన్స్‌‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌‌పీడీసీఎల్ చరిత్రలో తొలిసారిగా హనుమకొండ సర్కిల్ పరిధిలోని కేయూ సబ్‌‌స్టేషన్‌‌లో 16 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌‌ఫార్మర్‌‌ను రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రస్తుత లోడ్ కంటే 8 నుంచి 10 రెట్లు అధిక భారం పడినా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయవచ్చు. అలాగే నక్కలగుట్ట సబ్‌‌స్టేషన్‌‌లో 12.5 ఎంవీఏ సామర్థ్యంతో మరో రెండు పవర్ ట్రాన్స్‌‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇలాంటి పనులు కొనసాగుతున్నాయి.

తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు

పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా కొత్త సబ్‌‌స్టేషన్లు అవసరమవుతున్నాయి. పట్టణాల్లో భూముల కొరత, అధిక వ్యయం కారణంగా ఇండోర్ సబ్‌‌స్టేషన్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నం. ప్రస్తుతం ఉన్న సబ్‌‌స్టేషన్లలోనే 12.5, 16 ఎంవీఏ స్థాయి పవర్ ట్రాన్స్‌‌ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నాం. దీంతో సంస్థ పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించవచ్చు.

- కర్నాటి వరుణ్‌‌రెడ్డి, టీజీఎన్‌‌పీడీసీఎల్ సీఎండీ