- షెడ్యూల్ విడుదల చేసిన ఎన్‌టీఏ
- రెండు షిఫ్టుల్లో నిర్వహణ.. 80కి పైగా సబ్జెక్టులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే యూజీసీ నెట్ (జూన్ సెషన్) పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. ఈ పరీక్షలను జూన్ 22 నుంచి జూన్ 30 వరకు దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో పూర్తిగా సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించనున్నారు.
తొమ్మిది రోజుల పాటు.. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు ఉంటుంది. మొత్తం 80కి పైగా సబ్జెక్టులకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సుమారు 8 నుంచి 10 రోజుల ముందే ఎగ్జామ్ రాయాల్సిన సిటీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలిపింది.
ఆ తర్వాత అభ్యర్థుల అడ్మిట్ కార్డులను (హాల్ టికెట్లను) విడుదల చేస్తారు. అభ్యర్థులు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, అడ్మిట్ కార్డులు, మార్గదర్శకాలు, ఇతర ముఖ్యమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inను క్రమం తప్పకుండా చూడాలని అధికారులు సూచించారు.
