రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లలోని కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంతోపాటు దక్షిణాదిలో ధర్మల్ విద్యుత్తుకు డిమాండ్ లేని కారణంగానే ఎన్టీపీసీలోని యూనిట్లను షట్ డౌన్ చేశారు. ఎన్టీపీసీలోని పలు యూనిట్లనుంచి మొత్తం 1900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి నెలకొనడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్టీపీసీలోని 2600 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు స్టేవన్ లోని 200 మెగావాట్ల 1,2,3 యూనిట్లు, స్టేజ్ 2 లోని 500 మెగావాట్ల ఐదో యూనిట్ ను శనివారం రాత్రి నిలిపివేశారు. దీంతో మొత్తం 1900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సౌరవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగడంతో రాష్ట్రంలోని బొగ్గు ఆధారిత విద్యుత్తుకు డిమాండ్ తగ్గినట్టు సమాచారం. ప్రస్తుతం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.
తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల కు గాను 800 మెగావాట్ల ఒకటో యూనిట్ ను శనివారం రాత్రి నిలిపివేశారు. డిమాండ్ పెరిగితే ఒకటి రెండు రోజుల్లో తిరిగి యూనిట్లను ఉత్పత్తి దశలో కి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పగటిపూట సౌర, జల,వాయు విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్న క్రమంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలపై డిమాండ్ తగ్గుతుంది.ఈ ఆర్థిక సంవత్సరం నిర్ధేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనకు రామగుండం ఎన్టీపీసీ సాధ్యం కాకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
