- ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి
- రాక్షస పాలన కొనసాగిస్తున్నారని కామెంట్
- ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ఘాట్లో నివాళులు
హైదరాబాద్ సిటీ/ జూబ్లీహిల్స్, వెలుగు: టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్మారక స్థూపానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా తెలుగు ప్రజల గుండెల్లో విషాదం మిగిలిందని, ఆయన సేవలు పేదల హృదయాల్లో శాశ్వతంగా నిలిచాయని చెప్పారు.
ఎన్టీఆర్ వారసులు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని మరిచి హత్య రాజకీయాలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రైతులు, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ... ఎన్టీఆర్ సేవలు ప్రజల గుండెల్లో నిలిచాయని చెప్పారు.
బాలకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ మూడు అక్షరాలు కాదు, ప్రజలు మరచిపోలేని మహానాయకుడని చెప్పారు. కుల మతాలకు అతీతంగా నటనతో అందరిని ఆకట్టుకున్నారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజల అభివృద్ధికి కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అలాగే, నందమూరి కళ్యాణ్ రామ్, ఏపీ మంత్రి నారా లోకేశ్, తదితరులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లోని ఆరోగ్యశ్రీ వార్డులో రోగులకు బాలకృష్ణ పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లల వార్డులో క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారులకు ఆటవస్తువులు, పుస్తకాలు అందించి వారితో సరదాగా గడిపారు.
