
- వెయ్యి అడ్మిషన్లు దాటింది ఐదు స్కూళ్లలోనే
- విద్యాశాఖ అధికారిక లెక్కల్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మూడో వంతుకు పైగా బడుల్లో 30లోపే విద్యార్థులు చేరారు. రెండొంతుల బడుల్లో వందలోపే అడ్మిషన్లు అయ్యాయి. అలాగే వెయ్యికి పైగా పిల్లలున్న స్కూళ్లు కేవలం ఐదు మాత్రమేనని అధికారిక లెక్కలు బహిర్గతం చేస్తున్నాయి.
రాష్ట్రంలో జీరో ఎన్ రోల్మెంట్ బడులు, పీఎంశ్రీ స్కూళ్లు, ఐదారు మంది ఉన్నట్టు చూపించిన స్కూళ్లను పక్కన పెట్టి, 22,522 స్కూళ్లకు తాజాగా స్కూల్ గ్రాంట్స్‌ను అధికారులు మంజూరు చేశారు. వీటిలో 7,876 బడుల్లో 30 లోపు మంది మాత్రమే పిల్లలు ఉన్నారు. రాష్ట్రంలో 7,719 ఎలిమెంటరీ బడులు, 157 హైస్కూళ్లలో 1 నుంచి 30లోపు మంది పిల్లలు ఉన్నారు. 17,639 బడుల్లో విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నది.
ఎలిమెంటరీ లెవెల్లో 17,735 బడులుంటే వాటిలో వందలోపే 15,770 స్కూళ్లు ఉన్నాయి. మరోవైపు 251 నుంచి వెయ్యి పిల్లలున్న స్కూళ్లు కేవలం 1,106 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని ఐదు బడుల్లోనే వెయ్యికి పైగా స్టూడెంట్లు ఉండగా, ఆ ఐదూ సెకండరీ స్కూళ్లే. ఈ లెక్కలు విద్యాశాఖ అధికారులతో పాటు విద్యావేత్తల్లోనూ కలవర పెడుతున్నాయి. ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తూ, సంస్కరణలు తీసుకొస్తున్నా.. స్టూడెంట్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు.
29 కోట్లు మంజూరు..
స్కూళ్ల నిర్వహణ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు 50 శాతం గ్రాంట్ ను మంజూరు చేశారు. 22,522 బడులకు రూ.29.74 కోట్లు శాంక్షన్ చేశారు. కాగా, ప్రభుత్వం ఏటా 30లోపు స్టూడెంట్లున్న బడులకు రూ.10 వేలు, 31 నుంచి వంద వరకూ ఉన్న బడులకు రూ.25 వేలు, 101 నుంచి 250 వరకూ రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మంది పిల్లలుంటే రూ.75 వేలు, వెయ్యికిపైగా స్టూడెంట్లుంటే రూ. లక్ష నిధులు ఇస్తుంది. ప్రస్తుతం సగం చొప్పున నిధులు మంజూరు చేశారు.