- అక్రమంగా నిల్వ ఉంచినా, కృత్రిమ కొరత సృష్టించినా కేసులు
- సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారున. సిలిండర్లు అక్రమంగా నిల్వ ఉంచినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై పడుతున్న నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంశాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితి, తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలను వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో వరుస తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ నెల 9న హనుమకొండ, వరంగల్, కర్మాన్‌ఘాట్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, 22 డొమెస్టిక్ సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లు, గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్లను, ఫిబ్రవరి 14న ఇబ్రహీంపట్నం మండలంలోని బొంగులూరు ప్రాంతంలో 78 డొమెస్టిక్ సిలిండర్లు, ఒక వెహికల్‌ను పట్టుకున్నామని తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.2.36 లక్షలు ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రజలు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేయొద్దని, అక్రమ వినియోగంపై టోల్ ఫ్రీ నంబర్ 1967 లేదా 1800-425-00333కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
