రైతులు నష్టపోతే .. బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటుర్రు..

రైతులు నష్టపోతే .. బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటుర్రు..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడగండ్ల వానతో రైతులు పంట నష్టపోయి ఏడుస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తాగి తందనాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించి, భరోసా ఇయ్యాల్సిన సీఎం... ఔరంగబాద్ సభ అంటూ రాజకీయాలకు చేస్తున్నారన్నారు.

ఆయన కొడుకు కేటీఆర్.. మినీ ప్లీనరీల పేరుతో పార్టీ నేతలు, కార్యకర్తలతో చిందులు వేయిస్తున్నారని విమర్శించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రైతులు కన్నీళ్లు కారుస్తుంటే.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభల పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎవరి సొమ్మును.. ఎవరు.. ఎందుకు ఖర్చు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి.

దోచుకోవడం, దాచుకోవడమే.. కేటీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ నమూనానా? కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ డబ్బులు పంపించడం వల్లే కేసీఆర్ పాత మిత్రుడు కుమారస్వామి అలిగి కూర్చున్నాడు. ప్రధాని మోడీ కేరళ వెళ్తే అక్కడి సీఎం రిసీవ్ చేసుకొని వాళ్ల రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాడు. ఈ విజ్ఞత కేసీఆర్​కు లేకపోవడం దురదృష్టకరం” అని అన్నారు..