అందానికి ఓట్స్

 అందానికి ఓట్స్

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా కాపాడతాయి. చాలా రకాల చర్మ సమస్యల్నుంచి బయట పడేస్తాయి. మెరిసే చర్మాన్ని సొంత చేసుకోవాలంటే వీటితో చేసిన ప్యాక్స్, స్క్రబ్స్ వేసుకుంటే సరి. మొటిమలు, మచ్చలు, ట్యాన్, డార్క్ సర్కిల్స్  లాంటి వాటిని కూడా పోగొడతాయి ఓట్స్. ఇవే కాదు ఇంకా బోలెడు లాభాలున్నాయి వీటితో..

స్కిన్ రిపేర్

ఎండ, దుమ్ము, ధూళి వల్ల చర్మం దెబ్బతింటుంది చాలామందికి. చర్మం రంగు తగ్గడంతో పాటు నిర్జీవంగా మారుతుంది.  అలాంటప్పుడు ఒక కప్పు ఓట్స్ని మిక్సీ జార్లో వేసి పొడి చేయాలి.  ఆ మిశ్రమాన్ని  బకెట్ వేడినీళ్లలో  వేసి,  ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా కలపాలి. ఇరవై నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి.  ఇలా వారానికి  రెండుసార్లు  చేస్తే ఓట్స్లోని  మాయిశ్చరైజింగ్, క్లెన్సింగ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి.  చర్మానికి కొత్త మెరుపుని ఇస్తాయి.

క్లెన్సింగ్

చర్మంపై బ్లాక్ హెడ్స్, మృత కణాల్ని తొలగించడానికి రక రకాల ఫేషియల్స్ ట్రై చేస్తుంటారు. కానీ, ఓట్స్ ప్యాక్ చర్మంపై ఫేషియల్ కన్నా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.. ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి, కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాయాలి. చేతి వేళ్లు గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మంపై బ్లాక్ హెడ్స్ తొలగిపోవడంతో పాటు చర్మం మృదువుగా అవుతుంది.  కావాలంటే తేనెకి బదులు ఆలివ్ ఆయిల్ కూడా వాడొచ్చు.

యాక్నే సమస్యలు

ఓట్స్ ని రెగ్యులర్ డైట్లో భాగం చేస్తే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఓట్స్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్సిఫై  చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. దాంతో చర్మం కూడా మెరుస్తుంది. అలాగే  గుడ్డు తెల్ల సొనలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి వేసి పేస్ట్లా చేసి ముఖం, మెడ భాగాల్లో రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే యాక్నే సమస్యలు దరిచేరవు.

ఆయిలీ స్కిన్

కాలమేదైనా  సరే, కొందర్ని ఆయిలీ స్కిన్ వెంటాడుతుంటోంది. అలాంటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడిలో కొద్దిగా టొమాటో జ్యూస్ , రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసి ముఖానికి ప్యాక్ వేయాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే  ఓట్స్లోని నేచురల్ అబ్జార్బెంట్స్ ఆయిలీ స్కిన్ని దూరం చేస్తాయి.  అలాగే  అరటి గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి వేసి ముఖానికి ప్యాక్లా వేసుకుంటే ఫేషియల్ హెయిర్ సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.