హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణలో 25 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. చిన్న నగరాల్లోనూ వీటిని పెడతామని పేర్కొంది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఓబెన్ రార్ ఇవో మోటార్ సైకిల్‌కు హైదరాబాద్‌లోనే దేశంలో అత్యధిక బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది.
ప్రస్తుతం కొండాపూర్, వరంగల్, సికింద్రాబాద్, కరీంనగర్, ఆర్సీ పురంలో షోరూమ్‌లు ఉన్నాయి. రార్ ఇవో ప్రారంభ ధరను రూ. లక్షగా నిర్ణయించారు. కేవలం 15 రోజుల్లోనే 25 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయని, జూన్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ సీఈఓ మధుమిత అగర్వాల్ తెలిపారు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి చార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
