
- అక్రమార్కులపై క్రిమినల్ కేసులకు ఆదేశం
పద్మారావునగర్, వెలుగు: శ్మశాన వాటికల జోలికొస్తే ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులతో కలిసి బన్సీలాల్పేట సీసీ నగర్లోని కుర్మ సంఘం శ్మశాన వాటికను మంగళవారం ఆయన పరిశీలించారు.
శ్మశాన వాటికలో కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టారని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ ఘటనపై అక్కడకు వచ్చిన సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరామ్ ను ఎమ్మెల్యే వివరణ కోరగా.. ఈ స్థలం రికార్డ్ ప్రకారం శ్మశాన వాటికగానే ఉందని వివరించారు. కానీ నిర్మాణదారుడు కోర్టు నుంచి స్టే తీసుకున్నారని, కోర్టు స్టే ఇచ్చిన సర్వే నంబర్, శ్మశాన వాటిక సర్వే నంబర్లే వేర్వేరుగా ఉన్నాయని చెప్పారు.
దీంతో శ్మశానవాటిక జోలికి వచ్చేవారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వెంటనే కోర్టుకు వాస్తవాలు నివేదించి స్టేను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అలాగే అక్రమ నిర్మాణానికి అనుమతులు ఎవరు ఇచ్చారో విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు.
కేసు పరిష్కారం అయిన అనంతరం స్మశానవాటిక లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి తమకే అప్పగిస్తామని కుర్మ సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత ఉన్నారు.