గంజాయి తెచ్చిన ఒడిశా వాసులు అరెస్ట్

గంజాయి తెచ్చిన ఒడిశా వాసులు అరెస్ట్

గచ్చిబౌలి,వెలుగు: నగరానికి గంజాయి తీసుకువచ్చిన ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్​చేశారు. వారి కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్​గిరి జిల్లా కోర్కొండ గ్రామానికి చెందిన శివ బిస్వాస్ టైలర్. ఇదే జిల్లా నీలకంబరి గ్రామానికి చెందిన రాహుల్ సేన్ విద్యార్థి. ఇద్దరూ కలిసి డబ్బుల కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‎లో భవన నిర్మాణాల వద్ద కూలీలు, ఇతరులకు అమ్మేందుకు 5 కిలోల గంజాయితో గురువారం బస్సులో హైదరాబాద్​వచ్చారు. 

పక్కా సమాచారంతో ఎస్​వోటీ పోలీసులు సాయంత్రం గచ్చిబౌలి స్టేడియం వద్ద తనిఖీలు చేపట్టగా శివ బిస్వాస్, రాహుల్ సేన్​అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకొని చెక్​చేయగా గంజాయి లభించింది. నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్ట్​చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కర్నాటక వాసి ..

జిల్లాలోని తాండూరుకు గంజాయి తీసుకువస్తున్న కర్నాటక వాసిని పోలీసులు అరెస్ట్​చేశారు. ఎస్పీ నారాయణరెడ్డి కథనం ప్రకారం.. గంజాయి రవాణా జరుగుతోందని టాస్క్​ఫోర్స్​పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో జిల్లా టాస్క్​ఫోర్స్​ఇన్​స్పెక్టర్​అన్వర్​పాషా గురువారం మధ్యాహ్నం తన టీంతో కలిసి తాండూరు పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లా సేడం పట్టణానికి ఖాసీం పటేల్​అలియాస్ ఖాసీం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు. 

అతని వద్ద 1100 గ్రాముల పొడి గంజాయి లభ్యమైంది. గంజాయి స్వాధీనం చేసుకొని నిందితుడిని తాండూరు పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. కేసు నమోదు చేసి, ఖాసీంను అరెస్ట్​చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే సమీప పోలీస్​స్టేషన్లలో తెలియజేయాలని ఎస్పీ కోరారు. టాస్క్ ఫోర్స్ ఇన్​స్పెక్టర్ అన్వర్ పాషా, సిబ్బందిని ఆయన అభినందించారు.   

చత్తీస్​గఢ్​ వాసి.. 

చత్తీస్​గఢ్​రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం ఆగపల్లి వద్ద సాగర్​రహదారిపై పోలీసులు గురువారం ఉదయం 10 గంటలకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో చత్తీస్​గఢ్ రాష్ట్రంలోని రాజ్​నంద్​గాన్​జిల్లా​డొంగర్​గాన్ గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ ప్రమోద్ కుమార్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో కిలో గంజాయి దొరికింది. ఒడిశాలో కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు తెచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. గంజాయి స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్​చేసినట్లు సీఐ పేర్కొన్నారు.