ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం రైల్వే భద్రతా వ్యవస్థ, రైళ్ల ప్రమాదాలను నియంత్రించే కవచ్ వ్యవస్థ పనితీరు పై ప్రశ్నలను లేవనెత్తింది. గతంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు భారతీయ రైల్వే ప్రమాద నిరోధక వ్యవస్థ అయిన కవచ్ గురించి చెప్పారు. కవచ్ దశలవారీగా అమలు చేయబడుతుంది అని ఆయన వెల్లడించారు. మూడు రైళ్లు ఒకేసారి ప్రమాదానికి గురికావడంతో భారత రైల్వే చరిత్రలోనే ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. 2016- 2017 సంవత్సరం తర్వాత జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని చెబుతున్నారు.
కవచ్ ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ
రైళ్ల ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ 2022 లో కవచ్ అనే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. కవచ్ అనేది ఒక ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. అలాగే ఈ కవచ్ వ్యవస్థ ద్వారా రైళ్లు వెనక్కి నడుస్తాయి. అందువల్ల ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా అవి ఎట్టి పరిస్థితుల్లో ఢీకొనలేవు. ఈ కవచ్ వ్యవస్థను దశలవారీగా దేశవ్యాప్తంగా రైల్వే శాఖ అమల్లోకి తెస్తోంది. అయితే ఇప్పుడు ఆ రూట్‌లో కవచ్ వ్యవస్థ అందుబాటులో ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బడ్జెట్లో నిధులు కేటాయింపు
దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 1,455 రూట్ కిలోమీటర్లు కవర్ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చి 2024 నాటికి దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాల్లో ఈ కవచ్ వ్యవస్థను అమల్లోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ కవచ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతీ సంవత్సరం బడ్జెట్‌లో ఈ కవచ్ వ్యవస్థ కోసం కేటాయింపులు కూడా చేస్తోంది.ఈ కవచ్ వ్యవస్థ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
సంఘటన జరిగిన మార్గంలో కవచ్ వ్యవస్థ అందుబాటులో లేదని భారతీయ రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు. 2022 మార్చి 22 న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కవచ్ టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'కవచ్' భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆ సమయంలో అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం లింగంపల్లి- వికారాబాద్ సెక్షన్‌లోని గుల్లగూడ- చిటిగిడ్డ రైల్వే స్టేషన్ల మధ్య కవచ్ పనితీరును అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. రైల్వే మంత్రి స్వయంగా ఎదురెదురుగా వచ్చే రైళ్లలో ఒకదాంట్లో కూర్చొని కవచ్ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-హౌరా వంటి రద్దీ మార్గాల్లో 2వేల కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థను విస్తరిస్తామని రైల్వేమంత్రి వెల్లడించారు.
రైళ్లకు ఆటోమేటిక్‌గా బ్రేకులు
"ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినపుడు కవచ్ టెక్నాలజీ ద్వారా దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. ఈ వ్యవస్థతో రైళ్లకు ఆటోమేటిక్‌గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు.. ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ కవచ్ వ్యవస్థ గుర్తించి రైళ్లను ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ హెచ్చరిస్తుంది.
ఈ రూట్లో కవచ్ వ్యవస్థ అమలులో లేదా..
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని 65 లోకోమోటివ్‌లు, 1445 కిలోమీటర్ల మార్గంలో 134 స్టేషన్‌లలో ఈ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ట్రాక్ ల పరిధిలో చూస్తే.. 1200 కిలోమీటర్లలో కవచ్ వ్యవస్థ అమలులో ఉందని తెలుస్తోంది. మిషన్ రాఫ్తార్ ప్రాజెక్ట్‌లో భాగంగా న్యూఢిల్లీ-ముంబై, హౌరా-ఢిల్లీ మెయిన్ లైన్లలో 3,000 కిలోమీటర్ల మార్గంలో ఈ కవచ్ వ్యవస్థను అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే.. ప్రస్తుతం ప్రమాదం జరిగిన రైల్వే జోన్ లో కవచ్ వ్యవస్థ అమలులో లేదని అర్థం అవుతోంది. ఒకవేళ ఈ మార్గంలో ఈ కవచ్ వ్యవస్థ అందుబాటులో ఉండి ఉంటే ఇంతటి ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

